వలస వచ్చిన వైరస్‌!

ABN , First Publish Date - 2020-05-13T10:03:59+05:30 IST

ఐదారు రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య..

వలస వచ్చిన వైరస్‌!

37 మంది వలస కూలీలకు పాజిటివ్‌

కొవిడ్‌ ఆసుపత్రులకు తరలింపు

థానే నుంచి రైలులో వచ్చిన బాధితులు

ఆదోని డివిజన్‌ పునరావాస కేంద్రాల్లో విడిది

స్థానికులకు ముప్పు లేదంటున్న వైద్యులు


పత్తికొండ/కర్నూలు: ఐదారు రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తక్కువగా వస్తోంది. దీంతో పరిస్థితి మెరుగు పడుతోందని జిల్లా వాసులు భావించారు. ఇంతలో మరో బాంబు పేలింది. థానే నుంచి జిల్లాకు వచ్చిన వలస కూలీల్లో 27 మందికి కరోనా సోకినట్లు కొవిడ్‌ స్టేట్‌ అధికారులు మంగళవారం ప్రకటించారు. మహారాష్ట్రలోని థానే నుంచి కర్నూలుకు స్పెషల్‌ రైలులో 930 మంది వలస కార్మికులు వచ్చారు.


అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వీరందరు గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో దిగారు. కర్నూలు జిల్లా కార్మికులు అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోనిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పటి వరకూ 254 మంది వలస కార్మికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 38 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఇందులో కర్నూలు జిల్లావాసులు 27 మంది, కడప జిల్లాకు చెందిన ఒకరు, అనంతపురం జిల్లాకు చెందిన 10 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. పాజిటివ్‌ వచ్చిన వారిని కొవిడ్‌ ఆసుపత్రులకు తరలించారు.


గ్రీన్‌జోన్‌లో కలకలం

థానే నుంచి తిరిగొచ్చిన వలస కూలీల్లో 98 మందిని పత్తికొండ పట్టణంలోని మోడల్‌ పాఠశాలలో పునరావస కేంద్రంలో చేర్చారు. వంద పడకల సామర్థ్యం ఉన్న ఈ కేంద్రంలో వీరికి వసతి, భోజనం కల్పించారు. 9వ తేదీన కర్నూలు నుంచి వచ్చిన వైద్య సిబ్బంది నమూనాలను సేకరించి వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. వీరిలో 13 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో బాధితులను సోమవారం రాత్రి అంబులెన్సులలో కర్నూలుకు తరలించారు. 


కొవిడ్‌ కేంద్రాలకు..

థానే నుంచి వచ్చిన వలస కూలీల్లో 13 మందిని కర్నూలులోని కొవిడ్‌ ఆసుపత్రులకు తరలించినట్లు పత్తికొండ పునరావాస కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఏడుగురిని విశ్వభారతి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు, ఆరుగురిని చైతన్య కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చేర్పించామని ఆయన వెల్లడించారు. వలస కూలీలు అందరూ రైలు దిగిన తరువాత బస్సులో నేరుగా పునరావాస కేంద్రానికే వచ్చారని, బయట ఎక్కడా తిరగలేదని ఆయన వివరించారు. థానే నుంచి వచ్చిన వలస కూలీలతో పత్తికొండ పట్టణవాసులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తే అవకాశం లేదని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు.


ఆదోని డివిజన్‌ వారే..

థానే నుంచి పత్తికొండకు చేరుకున్న వలస కూలీలు అందరూ ఆదోని డివిజన్‌ వారేనని అధికారులు తెలిపారు. కొవిడ్‌ సెంటర్లకు తరలించిన 13 వలస కూలీల్లో తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన వారు నలుగురు, ఆస్పరి మండలం జోహరాపురం గ్రామానికి చెందిన వారు ఐదుగురు, ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన ఒకరు, కమ్మరచేడు గ్రామానికి చెందిన ఒకరు, పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన ఒకరు ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు.


గ్రీన్‌ జోన్‌లో గుబులు

పత్తికొండ ప్రాంతంలో ఇప్పటి వరకూ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం థానే నుంచి వచ్చిన వలస కూలీలలో కొందరిని కొవిడ్‌ ఆసుపత్రులకు తరలించారని తెలియగానే ఆందోళన చెందుతున్నారు. పునరావాస కేంద్రంలో ఉన్న కూలీలకు కొన్ని శాఖల సిబ్బంది ఆహారం, ఇతర సేవలు అందిస్తున్నారు. రెండు రోజుల కిత్రం ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కూలీలకు భోజనం అందించారు. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా వలస కూలీలకు భోజనం వండిపెడుతున్న వారు మంగళవారం ఉదయం చెప్పా పెట్టకుండా గైర్హాజరయ్యారు. దీంతో కూలీలకు సాయంత్రం వరకూ భోజనం అందలేదు. అధికారులు వేరే ప్రాంతంలో వంట చేయించి తెచ్చి కూలీలకు అందజేశారు. ఇకపై ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తహసీల్దారు తెలిపారు. 

Updated Date - 2020-05-13T10:03:59+05:30 IST