భూ కైలాసం.. బుగ్గ రామేశ్వరం

ABN , First Publish Date - 2020-02-12T11:16:54+05:30 IST

ప్రకృతి అందాల మధ్య కాల్వబుగ్గ దేవాలయం ఉంది. ఆలయం కింది భూమి పొరల నుంచి బుగ్గల రూపంలో నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉంటుంది.

భూ కైలాసం.. బుగ్గ రామేశ్వరం

ప్రకృతి అందాల మధ్య పవిత్ర క్షేత్రం

20 నుంచి 26 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు 


 ఓర్వకల్లు, ఫిబ్రవరి 11: ప్రకృతి అందాల మధ్య కాల్వబుగ్గ దేవాలయం ఉంది. ఆలయం కింది భూమి పొరల నుంచి బుగ్గల రూపంలో నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. సుందరమైన రాతి కట్టడాలతో రెండు పుష్కరణిలు ఉన్నాయి. ఉత్తరం దిశగా నిర్మించిన పుష్కరిణిలో కూడా బుగ్గలు పైకి వస్తూ కనిపిస్తాయి. ఈ నీటితో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి. లోయ నిండా పచ్చదనం పరుచుకొని ఉంది. దేవాలయాలలోకి వచ్చే భక్తులను ఎర్రమల కొండలు ఆకర్షిస్తాయి. 


రామేశ్వరస్వామి దేవాలయ చరిత్ర

సుసంపన్నుడైన జమదగ్ని కుమారుడు పరశురాముడు తన తండ్రిని సంహరించిన క్షత్రియ రాజులను 21 పర్యాయాలు దేశ నలుమూలల వెతికి నిర్మూలించాడు. ఈ రక్తపాతానికి మనస్తాపం చెందిన పరశురాముడు దోష నివృత్తి కోసం రెండు పచ్చటి కొండల నడుము స్వచ్ఛమైన రెండు పుష్కరిణులు నిర్మించాడు. గలగల పారే సెలయేటి  ఒడ్డున శివలింగాన్ని ప్రతిష్టించారు. అదే నేటి కాల్వబుగ్గ రామేశ్వరం. విజయనగరం సామ్రాజ్య కాలంలో ఈ ప్రాంతం ముద్దనూరు, కాల్వసీమగా పేర్కొంది. తర్వాత క్షేత్రానికి ఉత్తర వాయువ్యదశలో నీటి బుగ్గద్వారా ప్రవహించే నీరు హుసేనాపురం, కాల్వ గ్రామాల భూములను సస్యశ్యామలం చేయడం వల్ల ఈ ప్రాంతానికి కాల్వబుగ్గ అని పేరు వచ్చింది. ఈ క్షేత్రం ఓర్వకల్లు మండలంలో కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి పక్కన జిల్లాకు 30 కిలో మీటర్ల దూరంలో ఉంది. శివరాత్రి పర్వదినాన పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి ఉపవాసంతో శివలింగానికి పూజలు చేస్తే కైలాసంలో ఉన్నట్లేనని భక్తుల నమ్మకం. 


లక్షల వివాహాల వేదిక

జాతీయ రహదారి పక్కనే గల ఈ పుణ్యక్షేత్రం కొన్ని లక్షల వివాహాలకు వేదికగా నిలిచింది. ఇక్కడ వివాహం జరిపిస్తే దంపతుల జీవితం సుఖమయంగా సాగుతుందని ప్రజల నమ్మకం. వేసవి కాలంలో పెళ్లి వాయిద్యాలతో ఈ క్షేత్రం మార్మోగుతుంది. ఇక్కడ వివాహాలు జరిపించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నిర్మించింది. ఆలయం ఎదుట నంది విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రస్తుతం ఆలయ చైర్మన్‌ రమణారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 


శంకరాచార్యులచే శ్రీచక్ర ప్రతిష్ఠ

ఈ క్షేత్రం చరిత్రను తెలిపే శిలా ఫలకాలు, పుణ్యక్షేత్రం చుట్టుపక్కల దర్శనమిస్తాయి. ఇక్కడ గల శివుని కొలువులో భ్రమరాంబికా దేవి హస్తానికి కంచి కామకోటి ఫీఠాధిపతి శంకరాచార్యులచే శ్రీచక్ర ప్రతిష్ట జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నిత్యాగ్ని హోమగుండం కూడా ఏర్పాటు చేశారు. 


శ్రావణ, కార్తీక, మాఘమాసాల్లో

ఈ పుణ్యక్షేత్రం శ్రావణ, కార్తీక మాఘమాసాల్లో భక్తులతో కళకళలాడుతుంది. శివరాత్రి పర్వదినాన పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి ఉపవాసంతో జాగరణ చేసి శివలింగానికి పూజలు చేస్తారు. 


బ్రహ్మోత్సవాలు ఇలా: 

20న బుగ్గరామేశ్వర స్వామి కాల్వ గ్రామం నుంచి వర ప్రయాణం 

21న మహాశివరాత్రి కుంకురార్పణ, ధ్వజారోహణం, పంచామృతాభిషేకం, తెల్లవారుజామున 4 గంటలకు కళ్యాణోత్సవం

22న నందివాహన సేవ, సాయంకాలం 5 గంటలకు ప్రభోత్సవం

23న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం 

24న సోమవారం పగలు వసంతోత్సవం, సాయంత్రం పారువేట

25న పంచామృతాభిషేకం

26న ఉత్సవ మూర్తులు కాల్వ గ్రామానికి తిరుగు ప్రయాణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్‌ తెలిపారు 


శివరాత్రి ఉత్సవాలకు రండి  - ఈఓ ప్రసాద్‌: 

ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు కాల్వబుగ్గ రామేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. భక్తులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు బ్రహ్మోత్సవాలకు భారీగా తరలి రావాలి.


మహా శివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలు - ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీ నారాయణ శర్మ: 

మహాశివరాత్రి సందర్భంగా కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో కుంకురార్పణ, గజరారోహణం, బుగ్గరామేశ్వరస్వామి, భ్రమరాంబదేవికి పంచామృతాభిషేకం, నందివాహన సేవ చేస్తున్నాం.


భక్తులకు మౌలిక వసతులు కల్పించాం - గోప వెంకట రమణారెడ్డి, ఆలయ చైర్మన్‌, కాల్వబుగ్గ: 

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాం. మహిళలకు ప్రత్యేకంగా స్నానపు ఘట్టాలు ఏర్పాటు చేశాం. గుడి వద్ద స్వామివారి దర్శనానర్థం క్యూలైన్లు ఏర్పాటు చేశాం. ఆలయం ప్రాంగణంలో గట్టి బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 

Updated Date - 2020-02-12T11:16:54+05:30 IST