దివ్యాంగురాలి వైసీపీ నాయకుల అన్యాయం

ABN , First Publish Date - 2020-03-02T11:17:04+05:30 IST

మధ్యాహ్న భోజన ఏజెన్సీని అక్రమంగా తొలగించారని ఓ దివ్యాంగురాలు ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు.

దివ్యాంగురాలి వైసీపీ నాయకుల అన్యాయం

 మధ్యాహ్న భోజనం ఏజెన్సీ మరొకరికి..

12 ఏళ్లుగా భోజనం పెట్టిన సుధా నాగరాణి

దీక్షకు టీడీపీ, బీజేపీ, సీపీఐ మద్దతు


డోన్‌, మార్చి 1: మధ్యాహ్న భోజన ఏజెన్సీని అక్రమంగా తొలగించారని ఓ దివ్యాంగురాలు  ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. డోన్‌ పట్టణానికి చెందిన సుధానాగరాణి దివ్యాంగురాలు. డోన్‌ పాతపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆమె 2008 నుంచి మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. 12 ఏళ్ల నుంచి ఆమె కుటుంబానికి ఇదే ఉపాధి. పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నారు. కష్టనష్టాలకోర్చి ఇన్నాళ్లూ సేవలు అందించిన ఆమెను విద్యాశాఖ అధికారులు తొలగించారు. ఈ మేరకు డోన్‌ ఎంఈవో ప్రభాకర్‌ నోటీసులు ఇచ్చారు. సోమవారం నుంచి మధ్యాహ్న భోజనం ఏజెన్సీని తొలగించినట్లు  నోటీసుల్లో పేర్కొన్నారు. కొందరు వైసీపీ నాయకుల ఒత్తిడితో పాతపేటకు చెందిన సరస్వతి బాయి అనే మహిళకు ఏజెన్సీని అప్పగించారు. దీంతో సుధానాగరాణి డోన్‌ పాత బస్టాండ్‌లోని సమైక్యాంధ్ర కట్టపై రిలే దీక్ష చేపట్టారు. దివ్యాంగురాలు అనే కనికరం లేకుండా వైసీపీ నాయకులు ఏజెన్సీని లాక్కున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షకు టీడీపీ నాయకులు వలసల రామకృష్ణ, చిట్యాల మద్దయ్య గౌడ్‌, తాడూరు రంగనాథమయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సందు వెంకటరమణ, డోన్‌ నియోజకవర్గ కన్వీనర్‌ నటరాజ్‌, పట్టణ కన్వీనర్‌ ఆర్మీ రామయ్య, మండల కన్వీనర్‌ హేమ సుందర్‌రెడ్డి, సీపీఐ డోన్‌ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, ఏబీవీపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు హనుమంతు సంఘీభావం తెలిపారు. 


అన్యాయంగా లాక్కున్నారు..సుధా నాగరాణి, దివ్యాంగురాలు, డోన్‌

ఎలాంటి తప్పు చేయకపోయినా మధ్యాహ్న భోజనం ఏజెన్సీని అన్యాయంగా లాక్కున్నారు. మా అమ్మ, చెల్లి నా మీదే ఆధారపడి ఉన్నారు. 12 ఏళ్ల నుంచి భోజన ఏజెన్సీని నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పుడు వైసీపీ నాయకులు మా కడుపుకొట్టి మధ్యాహ్న భోజనం ఏజెన్సీని లాక్కున్నారు. నాకు న్యాయం చేయాలని దీక్ష చేపట్టాను. ప్రభుత్వం స్పందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. Updated Date - 2020-03-02T11:17:04+05:30 IST