శివ..శివా! మల్లన్న క్షేత్రంలో అపచారమా?

ABN , First Publish Date - 2020-12-30T06:01:23+05:30 IST

మల్లన్న క్షేత్రంలో కొందరు వ్యక్తుల తీరుపై భక్తులు..

శివ..శివా! మల్లన్న క్షేత్రంలో అపచారమా?

ఏడాదిన్నరలో 10 సార్లు మాంసం లభ్యం

అరకొర కేసులు.. పట్టించుకోనివి కోకొల్లలు

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు


కర్నూలు(ఆంధ్రజ్యోతి): మల్లన్న క్షేత్రంలో కొందరు వ్యక్తుల తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాంసాన్ని తరలిస్తూ ఆలయ ప్రతిష్ట మంట కలుపుతున్నారని మండిపడుతున్నారు. వీరిలో కొందరు అధికార పార్టీ నాయకుల అనుచరులు ఉండడం గమనార్హం. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా ఓ వైసీపీ నాయకుడి అనుచరుడిపై కేసు నమోదైంది. అంతలోనే దేవస్థానం ఓ శాశ్వత ఉద్యోగి మాంసం తరలించడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏడాదిన్నరలో ఏకంగా 11 సార్లు మాంసం తరలిస్తుండగా.. అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా సున్నిపెంట, లింగాలగట్టు తదితర చోట్ల నుంచి మాంసం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు కేసులు నమోదు చేయగా.. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు వచ్చినప్పుడు చూసీచూడనట్లు వదిలేసినట్లు సమాచారం. 


- ఓ మహిళ 10 కిలోల చికెన్‌ను తరలిస్తుండగా సాక్షి గణపతి దేవాలయం సమీపాన దేవస్థాన సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆమెపై అప్పట్లో కేసు నమోదుకాలేదు. 


- వైసీపీ నాయకుడి అనుచరుడు స్కూటీ డిక్కీలో 5 కిలోల మాంసాన్ని తరలిస్తుండగా అప్పట్లో విధుల్లోని సిబ్బంది వదిలేశారు. దీనిపై భక్తులు సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి సోదాలు చేయించగా డిక్కీలో ఐదు బ్లాక్‌ ప్లాస్టిక్‌ కవర్లలో మాంసం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేశారు. 


- దేవస్థానంలో హెల్పర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి 5 కిలోల మాంసాన్ని తరలిస్తుండగా సిబ్బంది తనిఖీల్లో దొరికాడు. అనంతరం అతడ్ని సస్పెండ్‌ చేసినా తర్వాత శిఖరం వద్ద విధులు కేటాయించారు. 


- కొన్ని సత్రాల సమీపంలో మాంసాన్ని భుజిస్తుండటాన్ని చూసిన కొందరు భక్తులు దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి చర్యలూ లేవు. 


- ప్రత్యేక సందర్భాలు, ఉత్సవాలు, పండుగల సమయంలో స్పెషల్‌ డ్యూటీకి వచ్చిన కొందరు అధికారులు విడిది గృహాల్లో మద్యం సేవించిన ఘటనలు ఉన్నాయి. 


- కొందరు స్థానికులు, ఇతరులు అడవిలో జంతువులను వేటాడి మాంసాన్ని దళారుల ద్వారా అమ్మేస్తున్నట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందేలోపే విక్రయిస్తున్నట్లు సమాచారం. 


మా దృష్టికి వస్తే కఠిన చర్యలు 

శ్రీశైలంలో మాంసం దొరికిన కేసులు తక్కువే. మాంసం తరలిస్తున్న వారిపై కేసులు నమోదు అయ్యాయి. ఓ దేవస్థానం ఉద్యోగి కూడా గతంలో దొరకడంతో సస్పెండ్‌ చేశాము. సెక్యూరిటీ సిబ్బందికి దొరికినా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా వరకు తగ్గాయి. 

-  కేఎస్ రామరావు, శ్రీశైలం ఈవో


 

Updated Date - 2020-12-30T06:01:23+05:30 IST