-
-
Home » Andhra Pradesh » Kurnool » Lockdown Red alert
-
31 వరకు జిల్లాలో రెడ్ అలర్ట్
ABN , First Publish Date - 2020-03-23T10:26:16+05:30 IST
కరోనా ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. జిల్లాలోనూ సోమవారం నుంచి ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ అమలు అవుతుంది. జిల్లా సరిహద్దుల్లో రాకపోకలను నిలిపేస్తారు.

144 సెక్షన్ అమలు
జిల్లా సరిహద్దుల్లో రాకపోకలు బంద్
అన్ని రకాల దుకాణాలు మూసివేత
నిర్ణీత వేళల్లో నిత్యావసరాల అమ్మకం
కూలీలకు కేంద్ర ప్రభుత్వ సాయం
కర్నూలు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కరోనా ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. జిల్లాలోనూ సోమవారం నుంచి ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ అమలు అవుతుంది. జిల్లా సరిహద్దుల్లో రాకపోకలను నిలిపేస్తారు. దుకాణాలను మూసివేయిస్తారు. నిత్యావసర సరుకుల అమ్మకం, కొనుగోలుకు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు. నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎవరూ బయట తిరగడానికి అనుమతి ఉండదు. నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయే కూలీలకు కేంద్ర ప్రభుత్వం తరఫున బియ్యం, పప్పులు సరఫరా చేస్తారు. 29వ తేదీకి వీరికి రేషన్ అందిస్తారు. ఒక్కో కూలీ కుటుంబానికి రూ.వెయ్యి నగదును ఏప్రిల్ 4వ తేదీ కల్లా అందిస్తారు. ఈ 9 రోజులు ప్రజలు సహకరించాలని సీఎం జగన్ ఆదివారం కోరారు.
రాకపోకలు బంద్
జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. మార్చి 31 వరకు ప్రయాణాలకు అనుమతించరు. ప్యాపిలి నుంచి అనంతపురం, బెంగుళూరు ప్రాంతంవారు జిల్లాకు వచ్చే అవకాశముంది. పంచలింగాల నుంచి తెలంగాణ, చాగలమర్రి వైపు నుంచి కడప జిల్లా వాసులు, మాధవరం, మంత్రాలయం మీదుగా కర్ణాటక వాసులు, బైర్లూటీ మీదుగా ప్రకాశం జిల్లా వాసులు జిల్లాలోకి వస్తుంటారు. ఈ మార్గాల్లో ప్రవేశాలను అడ్డుకుంటారు. జిల్లా వాసులు బయటకు వెళ్లకుండా, బయటి ప్రాంతాల నుంచి జిల్లాలోకి రాకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, పాలు వంటివి మాత్రమే జిల్లాలోకి అనుమతిస్తారు.