-
-
Home » Andhra Pradesh » Kurnool » Lockdown on the second day
-
రెండో రోజు లాక్‌డౌన్
ABN , First Publish Date - 2020-03-24T05:30:00+05:30 IST
ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించినా వాహనాలు యథావిధిగా తిరుగుతుండడంతో పట్టణంలోని ప్రధాన రహదారులలో వాహనాలు తిరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

పటిష్ఠ బందోబస్తు చేపట్టిన పోలీసులు
వాహనాల తనిఖీ
పలుచోట్ల బారికేడ్ల ఏర్పాట్లు
రోడ్లన్నీ నిర్మానుష్యం
ఆదోని, మార్చి 24: ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించినా వాహనాలు యథావిధిగా తిరుగుతుండడంతో పట్టణంలోని ప్రధాన రహదారులలో వాహనాలు తిరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాతఫ్లైఓవర్, ఎమ్మిగనూరు సర్కిల్, తిక్కస్వామి దర్గా, రోషన్ లాడ్జి ఇలా అనేక ప్రధాన కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
బన గానపల్లె
బనగానపల్లె పట్టణంలో రెండవ రోజు లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మంగళవారం ప్రజలు ఇంటి కే పరిమితమయ్యారు. పట్టణంలో అత్యవసర పరిస్థితులు ఉంటేనే పోలీసులు పట్టణంలోకి అనుమతించారు. 144 సెక్షన్ కఠినంగా అమలు చేశారు. బనగానపల్లె సీఐ సురే్‌షకుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు కృష్ణమూర్తి, మహే్‌షకుమార్, పోలీసు సిబ్బంది, స్పెషల్‌ఫోర్స్ సిబ్బంది పట్టణమంతా కలియతిరిగి వ్యాపార సంస్థలను మూసివేశారు. కిరాణం అంగళ్లు తప్ప వస్త్ర, టీ దుకాణాలు, హోటళ్లు, చికెన్, మటన్ సెంటర్లు పూర్తిగా బంద్ చేయించారు.
అలాగే పెట్రోల్ బంక్‌లు కూడా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే అనుమతించారు. సినిమాహాళ్లు బంద్ చేశారు. ఆటోలను తిరగనివ్వలేదు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎవరినీ రోడ్లపైకి అనుమతించకపోవడంతో పట్టణంలోని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరమైతే కుటుంబంలో ఒకరు బయటికి వచ్చి త్వరగా పని ముగించుకొని ఇంటికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో రెండో రోజు పట్టణంలోని ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు.
పత్తికొండ
పత్తికొండలో పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బందోబస్తు నిర్వహించారు. వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు అత్యవసరసేవల దుకాణాలు మినహా మిగిలిన దుకాణాలను మూసి వేయించారు. సీఐ ఆదినారాయణ, ఎస్‌ఐ గుర్రప్ప సిబ్బందితో కలసి రహదారులపై తిరుగుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.
ఆలూరు
144 సెక్షన్ మంగళవారం కొనసాగింది. సీఐ భాస్కర్, ఎస్‌ఐ శ్రీనివాసులు గస్తీ నిర్వహించి ప్రజలను బయటకు రానీయకుండా కౌన్సెలింగ్ నిర్వహించారు. దుకాణాలు మూయించి వేశారు. ఎవరూ ఇళ్లను విడిచి బయటికి రాకూడదని ఆదేశించారు. గుంపులుగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టణంలోని అన్ని వీధుల్లో గ్రామ పంచాయతీ అధికారులు పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టారు. ఇన్‌చార్జి ఈవోపీఆర్డీ శ్రీహరి డ్రైన్లను శుభ్రం చేయించి బ్లీచింగ్‌పౌడర్ చల్లించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.
కోవెలకుంట్ల
కోవెలకుంట్లలో మంగళవారం లాక్‌డౌన్ పకడ్బందీగా కొనసాగింది. పోలీసుల కట్టుదిట్టంగా వ్యవహరించడంతో ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు మాత్రం నిత్యావసర సరుకుల, ఏవో సాకులు చెబుతూ రోడ్లపైకి రావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎక్కడికక్కడే వాహనాలు ఆపి వెనక్కి పంపుతున్నారు. కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు ఉదయం 7 గంటల నుంచి పట్టణం మొత్తం కలియదిరిగారు. తెరిచి ఉన్న దుకాణాలను మూయించి వేశారు. నిత్యావసర కూరగాయలు, కిరాణం దుకాణాలు మాత్రం మినహాయించి అన్నింటికి మూయించారు.
పట్టణంలోని జమ్మలమడుగు సర్కిల్, నంద్యాల సర్కిల్, ఆళ్లగడ్డ సర్కిల్, అవుకు, బనగానపల్లె తదితర కూడళ్లల్లో ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. బుధవారం కూడా ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటికి రావద్దని, 144 సెక్షన్ పకడ్భందీగా అమలు అవుతుందని, బయటికి వస్తే వారిపై కేసులు నమోదు చే స్తామని ఎస్‌ఐ హెచ్చరించారు.
దేవనకొండ
మండలంలో 144 సెక్షన్ అమలులో ఉండడం వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలన్నీ మూతబడ్డాయి. అత్యవసరమైన మెడికల్‌షాపులు, ఆస్పత్రి కూరగాయల మార్కెట్లు మాత్రమే తెరుచుకున్నాయి. ఎవరూ ఇళ్ల నుంచి రోడ్లపైకి రాకూడదని ఎస్‌ఐ మారుతి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆస్పరి
మండలంలో 144 సెక్షన్ అమలు చేశారు. ప్రధానమైన కర్నూలు-బళ్లారి, ఆదోని-పత్తికొండ రోడ్ల కూడలిలో వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఇళ్ల నుంచి ఎవరినీ రోడ్ల వెంబడి తిరగనీయకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. వ్యాపార అంగళ్లు మూసివేయడంతో పండుగ పూట మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
చిప్పగిరి
స్వీయ నియంత్రణే కరోనా వైర్‌సకు సరైన మందు అని వైద్యాధికారి జమీల్ అహ్మద్, ఎస్‌ఐ అబ్దుల్‌జాహిర్ అన్నారు. మంగళవారం చిప్పగిరి అంబేడ్కర్ సర్కిల్ వద్ద పోలీసులు చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. పోలీసులకు, వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించినప్పుడే కరోనా వ్యాధిని నివారించవచ్చన్నారు. 144 సెక్షన్ అమలులు ఉందని ఎస్‌ఐ తెలిపారు. కార్యక్రమంలో ఏఎ్‌సఐ కృష్ణమూర్తి, పోలీసులు అనిల్, చంద్ర, రాజు, వలి, రవి, వెంకటరమణ, అంజి పాల్గొన్నారు.