-
-
Home » Andhra Pradesh » Kurnool » Local Elections SP Fakkeerappa
-
డబ్బు, మద్యం రవాణాపై గట్టి నిఘా పెట్టాలి
ABN , First Publish Date - 2020-03-13T11:55:11+05:30 IST
స్థానిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల దగ్గర డబ్బు, మద్యం రవాణాపై గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశించారు.

ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఆదోని, మార్చి 12: స్థానిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల దగ్గర డబ్బు, మద్యం రవాణాపై గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశించారు. గురువారం స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్స్‌తో పాటు 34 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో 53 జడ్పీటీసీ, 804 ఎంపీటీసీల నామినేషన్లు ముగిసాయని తెలిపారు. రెండో దఫాలో జరిగే సర్పంచ్ ఎన్నికలను 970 గ్రామ పంచాయతీలకు, 10, 200 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో ఎంపీటీసీలకు 4,022 మంది, జడ్పీటీసీకి 351 మంది నామినేషన్లు వేశారని తెలిపారు. 12 వేల మంది పీవో, ఏపీవోలకు, 13,500 మంది ఓపీవోలకు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని, వీరికి 16, 18వ తేదీన మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారని తెలిపారు. ముఖ్యంగా మున్సిపల్, ఎంపీటీసీకి సంబంధించిన కౌంటింగ్‌ను ఆర్ట్స్ కళాశాలలోనే ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 106 అతి సమస్యాత్మక, 159 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని, మున్సిపాలిటీల్లో 33 వార్డులు అతిసమస్యాత్మక, 50 సమస్యాత్మక వార్డులను గుర్తించి ఎన్నికల దృష్ట్యా అక్కడ ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. పంచాయతీల ఎన్నికల్లో భాగంగా 306 సమస్యాత్మక పంచాయతీలను, 204 అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీలను గుర్తించామన్నారు. ఎన్నికల్లో భాగంగా 1500 పోలీస్ బలగాలను బందోబస్తుకు ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన మేరకు కర్ణాటక నుంచి పోలీస్ బలగాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 42 చెక్‌పోస్టులు, 7 సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలు నిఘా పెట్టామన్నారు. ప్రతి వాహనాన్ని నిలిపి పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. తనిఖీల్లో భాగంగా రూ.18 లక్షలు గుర్తించామని, వాటికి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ సురాలో భాగంగా 73 కేసులు నమోదు చేసి 105 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలపై ఎక్సైజ్, పోలీస్ బలగాలతో పాటు ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసి మరింత గస్తీ పెంచామన్నారు. ఎవరైనా కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల రోజు అవకతవకలు చేసినట్లు గుర్తిస్తే ఎన్నిక అయ్యాక కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్‌లతో పాటు కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.