వెలుగుల పండుగ
ABN , First Publish Date - 2020-11-13T05:53:45+05:30 IST
సర్రున ఆకాశంలోకి దూసుకుపోయే తారాజువ్వలు.. గిర్రున భూమిని చుట్టేసే విష్ణుచక్రాలు.. ఢాం.. ఢాం.. అని పేలే లక్ష్మీబాంబులు ఈ దీపావళికి కనిపిం చకపోవచ్చు.
- గ్రీన్ క్రాకర్స్‌కే అనుమతి
- రెండు గంటలే కాల్చాలి
- కొవిడ్ ప్రబలకుండా నిర్ణయం
- రేపు దీపావళి
కర్నూలు(కల్చరల్/హాస్పిటల్), నవంబరు 12: సర్రున ఆకాశంలోకి దూసుకుపోయే తారాజువ్వలు.. గిర్రున భూమిని చుట్టేసే విష్ణుచక్రాలు.. ఢాం.. ఢాం.. అని పేలే లక్ష్మీబాంబులు ఈ దీపావళికి కనిపిం చకపోవచ్చు. కొవిడ్-19 నేపథ్యంలో దీపావళి వేడుకపై జాతీయ హరిత ధర్మాసనం (ఎన్‌జీటీ) కాలుష్య నగరాల్లో టపాసులను నిషేధించింది. ఇతర ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చింది. అది కూడా రెండు గంటలు మాత్రమే కాల్చాలని సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ బాణసంచా మోతలు తగ్గనున్నాయి. కొవిడ్ బాధితులు, ఆస్తమా, ఊపిరిత్తులు, గుండె వ్యాధులతో ఇబ్బంది పడేవారిని దృష్టిలో ఉంచుకుని,కాలుష్యానికి కారణమయ్యే బాణసంచాను పూర్తిగా నిషేధించారు. పొగవల్ల కొవిడ్ సులువుగా సోకుతుందని, పొగ, వాయు కాలుష్యానికి దూరంగా ఉండాలని వైద్యనిపుణులు కూడా హెచ్చరిస్తు న్నారు. జిల్లాలో ఈ ఏడాది పరిమిత సంఖ్యలో వ్యాపారులను టపాసుల అమ్మకానికి అనుమతి ఇచ్చారు. గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. ఈ ఏడాది కాలుష్యరహితంగా, వెలుగులు పంచే వేడుకగా దీపావళి వస్తోంది. జిల్లాలో శనివారం వేడుకను నిర్వహించుకోనున్నారు.
గ్రీన్ క్రాకర్స్ అంటే..
సాధారణ టపాసుల్లాగే గ్రీన్ క్రాకర్స్ కూడా తయారవుతాయి. కానీ వీటిలో పర్యావరణానికి హాని కలిగించే బేరియం నైట్రేట్ ఉండదు. ప్రస్తుతం మార్కెట్‌లో గ్రీన్స్ క్రాకర్స్ రకరకా లుగా లభిస్తున్నాయి. సంప్రదాయ బాణసం చాతో పోలిస్తే ఇవి శబ్దం కూడా తక్కువ చేస్తాయి. వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటివి ఉండవు. సల్ఫర్‌తో శబ్ద తీవ్రత ఎక్కు వగా ఉంటుంది. ఆ వెలుగు కూడా కళ్లకు హాని చేస్తుంది. గ్రీన్ క్రాకర్స్‌లో కాకర పుల్లలు, పెన్సిళ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు లభిస్తాయి.
ఆ రసాయనాలు ప్రమాదకరం
కొవిడ్ మహమ్మారి ఇంకా అక్కడక్కడా కనిపి స్తోంది. దీర్ఘకాలిక వ్యాఽధులతో బాధపడేవారు కొవిడ్ సోకితే కోలుకోవడం కష్టతరం అవుతోంది. ఇప్పటికే పలువురి ప్రాణాలను హరించింది. దీపావళి సమయంలో టపాసులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. బాణసంచాలో వినియోగించే పొటాషియం, పాస్పరస్ వంటి రసాయనాలు, కార్బన్ డై ఆక్సైడ్ వల్ల ఊపిరితిత్తులకు హాని కలుగుతుంది. అందుకే ఈ దీపావళిలో కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో టపాసులపై నిషేధం విధించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఇచ్చింది. రాత్రి 8 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని ఆదేశించింది. కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది.
కాల్చేటప్పుడు జాగ్రత్త
కొనుగోలు చేసి తెచ్చిన బాణసం చాను సురక్షిత ప్రాంతంలో పెట్టాలి.
కాల్చేటప్పుడు చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి.
బాణసంచా కాల్చే సమయంలో బిగువైన కాటన్ దుస్తులు ధరించాలి.
ఇంట్లో బకెట్‌లో నీళ్లు, ఇసుక సిద్ధంగా ఉంచుకోవాలి.
కాల్చిన కాకరపుల్లలను సిద్ధం చేసుకున్న ఇసుక టబ్‌లో వేసుకోవాలి.
ముందుజాగ్రత్త చర్యగా ఫస్ట్‌ఎయిడ్ కిట్ సిద్ధంగా పెట్టుకోవాలి.
బాణసంచా కాల్చే సమయంలో పరిసరాలను, సమీపంలోని వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవాలి.
ఎమర్జెన్సీ కాంటాక్టు నెంబర్లు సిద్ధంగా ఉంచుకోవాలి.
వ్యాపారులకు సూచనలు
షాపులు విశాల ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి.
హోటళ్లు, వంటశాలలు ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.
నాణ్యమైన విద్యుత్ బల్బులు, ఎలక్ర్టికల్ వైరింగ్‌ను ఉపయోగించాలి.
షాపుల వద్ద అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
ట్రాన్స్‌ఫార్మర్ల పక్కన బాణసంచా షాపులు ఏర్పాటు చేయకూడదు.
విక్రయదారులు కాటన్ దుస్తులు ధరించాలి.
కళ్లను కాపాడుకోవాలి...
శరీరంలో కళ్లు ప్రధానమైనవి. చూపు కోల్పోతే తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం. అందువల్ల బాణసంచా కాల్చే సమయంలో కంటికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు దగ్గర ఉండాలి. పొరపాటున కంట్లోకి బాణసంచా రసాయనాలు పోతే ఐబాకో (కన్నుగుడ్డు) పగులుతుంది. కంటి శుక్లం దెబ్బతింటుంది. ఎక్కువ కాంతి వచ్చే టపాసులు కాల్చడం, చూడటం కూడా మంచిది కాదు. కంటికి గాయం అయితే వెంటనే చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కుని, కంటి వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. - డాక్టర్ పి.సుధాకర్‌రావు, కంటివైద్య నిపుణుడు, కర్నూలు
శబ్దంతో చెవుడు..
బాణసంచా ధ్వనికి దూరంగా ఉండాలి. 90 డెసిబుల్స్ శబ్దం దాటితే చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని సార్లు కర్ణభేరి దెబ్బ తిం టుంది. పొగవల్ల అలర్జీ, తుమ్ములు, ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరిత్తులు, ఆస్తమా రోగులు బాణసంచా పొగ పీల్చుకుంటే చాలా ఇబ్బంది పడతారు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. వీరికి కొవిడ్ సోకితే మరింత ప్రమాదం. - డాక్టర్ బి.జయప్రకాశ్ రెడ్డి, ఈఎన్‌టీ వైద్య నిపుణుడు, కర్నూలు