ఉల్లి వేలం ఆరంభిస్తాం
ABN , First Publish Date - 2020-08-22T10:10:00+05:30 IST
జిల్లాలో ఉల్లి రైతుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని సోమవారం నుంచి వారానికి ఆరు రోజులు ఉల్లిగడ్డల వేలం కర్నూలు మార్కెట్‌యార్డులో నిర్వహించా
సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి
కర్నూలు(అగ్రికల్చర్), ఆగస్టు 21: జిల్లాలో ఉల్లి రైతుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని సోమవారం నుంచి వారానికి ఆరు రోజులు ఉల్లిగడ్డల వేలం కర్నూలు మార్కెట్‌యార్డులో నిర్వహించాలని నిర్ణయించినట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉల్లి వేలం పాట జరుగుతుందని తెలిపారు. ఈ రోజుల్లో రైతులు ఉల్లిగడ్డలను ఇళ్లవద్దనే గ్రేడింగ్ చేసుకుని ఆరబెట్టి విక్రయానికి మార్కెట్‌యార్డుకు తీసుకునిరావాలని సూచించారు.
ఉల్లిగడ్డల వాహనాలను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే యార్డులోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ప్లాట్‌ఫారాలపై ఉల్లిగడ్డలను నిల్వ చేయరాదని, రైతుల తమ వాహనాల్లో ఉల్లిగడ్డలను వ్యాపారుల శాంపిల్స్ ద్వారా పరిశీలించి వేలంపాటలో ధరను నిర్ణయించి కొనుగోలు చేస్తారని తెలిపారు.
రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతు అలాగే వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని , శానిటైజర్ వాడాలని తెలిపారు. మెయిన్ గేటు నుంచి లోనికి వచ్చే సమయాల్లో థర్మల్ టెంపరేచర్ స్కానర్ ద్వారాపరీక్ష చేయించుకుని లోపలికి రావాలని సూచించారు.