న్యాయ రాజధానిగా కర్నూలు.. రాజకీయ నేతల అభిప్రాయాలివీ..!

ABN , First Publish Date - 2020-08-01T19:21:16+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే వైసీపీ ప్రభుత్వం నిర్ణయానికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో వైసీపీ నాయకుల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి.

న్యాయ రాజధానిగా కర్నూలు.. రాజకీయ నేతల అభిప్రాయాలివీ..!

రాజధాని వికేంద్రీకరణకు గవర్నర్‌ ఆమోదం

స్వాగతిస్తున్నామన్న వైసీపీ, బీజేపీ నాయకులు

సీమ ప్రజల్ని మోసం చేస్తున్నారు: ప్రతిపక్ష నేతలు


కర్నూలు (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే వైసీపీ ప్రభుత్వం నిర్ణయానికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో వైసీపీ నాయకుల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. ఒక్క హైకోర్టుతోనే కర్నూలు న్యాయ రాజధాని ఎలా అవుతుందని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయ రాఽజధానిని ఏర్పాటు చేయడం పేరుతో ముఖ్యమంత్రి సీమ ప్రజల్ని మోసం చేస్తున్నారని, కర్నూలుకు రాజధానిని దూరం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమకు రాజధాని ఇవ్వాలన్న డిమాండ్‌ మరోసారి తెరపైకి వస్తున్నట్లు సమాచారం. అవసరమైతే రాయలసీమ ఉద్యమ గళాన్ని బలంగా వినిపిస్తామని పలువురు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నాయకుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. 

 

హైకోర్టు ఇవ్వగానే న్యాయ రాజధాని అవుతుందా?: సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

కర్నూలుకు హైకోర్టు ఇవ్వడానికి టీడీపీ వ్యతిరేకం కాదు. హైకోర్టు ఇచ్చినంత మాత్రాన న్యాయ రాజధాని ఎలా అవుతుందో సీఎం తెలపాలి. సీమ ప్రజల్ని మోసం చేయడంలో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయ రాజధాని పేరును తెరపైకి తెస్తున్నారు. ఉంటే రాజధానిని అమరావతిలోనే ఉంచాలి. మార్చాలనుకుంటే కర్నూలుకే శాశ్వత రాజధానిని తరలించాలి. 


మొండిగా వ్యవహరిస్తున్నారు: కోట్ల సుజాతమ్మ, మాజీ శాసనసభ సభ్యురాలు

ఎన్నికల కమిషనర్‌ నియామకంతో న్యాయం గెలిచిందనుకునేలోపు సీఎం తన మొండితనాన్ని నిరూపించకున్నారు. కర్నూలును పూర్తి రాజధానిగా చేయాలి. కేవలం హైకోర్టు బెంచ్‌ను కర్నూల్లో ఏర్పాటు చేస్తారా? చెప్పాలి. 


రాజధానులు మార్చుకుంటూ పోతే ఎలా?:వాల్మీకి పార్థసారథి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి. అవసరమైతే పోరాటాలు చేస్తాం. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులను మార్చుకుంటూ పోతే తుగ్లక్‌ పాలన అవుతుంది. 


అమరావతిని దేశ రెండో రాజధానిగా చేయాలి: రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ 

రాయలసీమలో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ అన్నారు. శుక్రవారం కర్నూలులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ న్యాయ రాజధానితో పాటు మినీ సెక్రటరియేట్‌, శీతాకాల సమావేశాలు ఇక్కడే ఉండాలన్నారు. న్యాయ రాజధాని రాయలసీమ డిక్లరేషన్‌లో కూడా పెట్టామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ న్యాయ రాజధాని ఇచ్చి చేతులు దులుపుకోరాదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం ఉన్నా తెలంగాణ ప్రభుత్వం 60 టీఎంసీలు వాడుకుంటోందన్నారు. మన ప్రభుత్వం విద్యుత్‌ ఇస్తామని చెప్పినా వినకుండా శ్రీశైలం నీటిని వాడుకుంటున్నారన్నారు. దీంతో ఆంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందన్నారు. శ్రీశైలంలో 870 అడుగుల వరకు నీరున్నా మన ప్రభుత్వం వాడుకోవడం లేదన్నారు. కేసీఆర్‌ కుతంత్రాలు జగన్‌ అర్థం చేసుకోవాలన్నారు. రాజధాని విషయం హైకోర్టులో ఉందని, దీని పరిష్కార మార్గంగా అభివృద్ధి చేస్తామని అందరితో చర్చించి ఈ ప్రాంత ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. 


న్యాయ రాజదానితో అభివృద్ధి: పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడంతో రాయలసీమ అభివృద్ధి చెందుతుందని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మూడు రాజదానుల బిల్లుకు గవర్నర్‌ శుక్రవారం ఆమోదం తెలపడడంతో పాతబస్టాండులో వైసీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పాణ్యం, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌ మిఠాయిలు పంచుకున్నారు. కాటసాని మాట్లాడుతూ గతంలో రాజధానిని కర్నూలు త్యాగం చేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి న్యాయ రాజధాని ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం, గవర్నర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు. 

Updated Date - 2020-08-01T19:21:16+05:30 IST