సాంస్కృతిక ప్రదర్శనలు నిలిపివేత
ABN , First Publish Date - 2020-11-26T05:57:50+05:30 IST
puskar

- సంకల్‌భాగ్ ఘాట్ వద్ద రద్దు చేసిన అధికారులు
- కొవిడ్ కారణంగానేనని అనుమానాలు
- ఆరోరోజూ ఘాట్ల వద్ద కనిపించని రద్దీ
- కొన్ని ఘాట్లలో స్నానాలకు అనుమతి!
కర్నూలు సంకల్ భాగ్‌లోని వీఐపీ పుష్కర ఘాట్‌లో బుధవారం మధ్యాహ్నం అర్ధాంతరంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిలిపివేశారు. మళ్లీ తాము చెప్పేవరకు ప్రదర్శనలు ఏర్పాటు చేయవద్దని నిర్వాహకులను ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ఆవేదనతో తిరుగుముఖం పట్టారు. ఘాట్‌లో కొందరికి కొవిడ్ ఉన్నట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మంత్రాలయం/ఎమ్మిగనూరు టౌన్, కర్నూలు(న్యూసిటీ, రూరల్, కల్చరల్), గూడూరు, సి.బెళగల్, నందికొట్కూరు రూరల్, జూపాడుబంగ్లా, నందవరం, ఆత్మకూరు, కొత్తపల్లి, నవంబరు 25: తుంగభద్ర పుష్కరాల్లో బుధవారం ఆరో రోజజూ భక్తుల సందడి తగ్గింది. మంత్రాలయంలోనూ రద్దీ తగ్గింది. మఠం ఘాట్, సంతమార్కెట్ ఘాట్ల వద్ద మాత్రమే కొందరు కనిపించారు. వీపీఐ ఘాట్, ఎన్‌ఏపీ ఘాట్, వినాయక్ ఘాట్లు వెలవెలబోయాయి. యోగీంద్ర కళామండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
గజల్ శ్రీనివాస్ బుధవారం మంత్రాలయానికి వచ్చారు. వీఐపీ ఘాట్ వద్ద పుష్కర స్నానం ఆచారించారు. బృందావనాన్ని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శేషవస్త్రం, ఫలమంత్రాక్షితలు ఇచ్చి అశీర్వదించారు.
మంత్రాలయం ఎన్‌ఏపీ పథకం సమీపంలో వీఐపీల కోసం నిర్మించిన ఘాట్ నిరుపయోగంగా మారింది. సకాలంలో పనులు పూర్తి కాకపోవడంతో మఠం ఘాట్‌ను వీఐపీ ఘాట్‌గా మార్చేశారు. ఎన్‌ఏపీ ఘాట్‌లో సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం నెరవేరలేదు.
ఘాట్‌లలో పలుచగా భక్తులు
ఫ కర్నూలు నగరంలోని రాంభొట్ల, రాఘవేంద్ర ఘాట్లలో భక్తులు పలుచగా కనిపించారు. భక్తులు, పారిశుధ్య కార్మికులకు ఎన్జీవోలు అల్పాహారం, పండ్లు, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశాయి. రాఘవేంద్ర మఠం ఘాట్‌లో ఏర్పాటు చేసిన సంపులో పారిశుధ్య కార్మికులు వ్యర్థాలను జాలితో తొలగించారు. ఘాట్‌లలో స్టాల్స్ కొన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి.
కర్నూలు మండలంలోని పంచలింగాల పుష్కర ఘాట్‌ను జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. సుంకేసుల ఘాట్‌లో భక్తులు పుష్కర స్నానాలు చేసి నదిలో దీపాలు వదిలారు. పుష్కర ఘాట్లలో కుటుంబ సభ్యులుతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఘాట్స్ స్పెషల్ ఆఫీసర్లు వేణుగోపాల్, రఘురాం, డీఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి, కోడుమూరు సీఐ పార్థసారథిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సి.బెళగల్ మండలంలోని గుండ్రేవుల పుష్కర ఘాట్‌లో భక్తులు ఎక్కువగా కనిపించారు. బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చారు. నదీ స్నానాలకు అవకాశం లేకపోవడంతో మునగాలపాడు పుష్కరఘాటుకు పిండ ప్రదానం చేసేవారు మాత్రమే వస్తున్నారు.
జూపాడుబంగ్లా మండలంలోని రాఘవేంద్ర మఠం పుష్కరఘాట్ వద్ద భక్తులు కార్తీక దీపాలు వదలడానికి వీలుగా అప్పటికప్పుడు కంచె బయటివైపు గోడ నిర్మించారు. సంపులోకి మంగళవారం నీరు వదడంతో సాయంత్రం గోడ కూలిపోయింది. భక్తులు పలుచగానే కన్పించారు. కర్నూలుకి చెందిన లక్ష్మీనారాయణ తన తండ్రి పెద్దపుల్లయ్య జ్ఞాపకార్థం ఘాట్ వద్ద ఐదు రోజుల నుంచి అన్నదానం చేస్తున్నారు. అలై క్లబ్ అసోసియేషన్ జిల్లా గవర్నర్ రాయపాటి శ్రీనివాసులు కార్మికులకు, భక్తులకు అల్పాహారం అందించారు. నందవరం మండలంలోని నాగలదిన్నె పుష్కరఘాట్ వద్ద మురుగునీరు నదిలోకి చేరుతోంది. దీంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురుజాల ఘాట్‌లో ఆరో రోజు భక్తుల సందడి కనిపించింది. షవర్ల కింద స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వదిలారు.
సంకల్‌బాగ్ పుష్కర ఘాట్‌లో బుధవారం మధ్యాహ ్నం వరకు కొనసాగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. బలరామాచార్య తుంగభద్ర తీరంలోని క్షేత్రాల గురించి వివరించారు. కాశీ క్షేత్రం నుంచి విచ్చేసిన రాజేశ్ తివారి హిందూస్థానీ భక్తిగీతాలు ఆలపించారు. ఆంజనేయులు శిష్యబృందం చేసిన భరతనాట్యం ఆకట్టుకుంది. నృత్య శిక్షకుడు కరీముల్లా బృందంలో చిన్నారులు జ్యోత్స్న, శివాని చేసిన ఆఽధ్యాత్మిక నృత్య ప్రదర్శన భక్తులను తన్మయపరిచింది. ఖతార్ నుంచి వచ్చిన లాస్య చేసిన కూచిపూడి నృత్యం, మిలిటరీ కాలనీ జడ్పీ స్కూల్‌కు చెందిన భవాని, సుజాత, రెహనా బుర్రకథ, నారాయణ పాఠశాల విద్యార్థిని కుసుమప్రియ కూచిపూడి నృత్యం, రజని కల్కూర ఆలపించిన భక్తిగీతాలు అలరించాయి. రాజగోపాల్‌రెడ్డి బృందం శ్రీకృష్ణతులాభారం నాటిక ప్రత్యేకంగా నిలిచింది.
సంకల్ భాగ్ పుష్కర ఘాట్‌లో బుధవారం సాయంత్రం నదీమతల్లికి పంచ హారతులిచ్చారు. మహానంది పుణ్య క్షేత్రానికి చెందిన వేద పండితుడు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో కుంభ హారతి, నంది హారతి, బిల్వ హారతి, నాగ హారతి, నక్షత్ర హారతి ఇచ్చారు. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితులు లక్ష్మీనారాయణ హవనం నిర్వహించారు.
సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో తుంగభద్ర పుష్కరాల్లో ఆరో రోజు బుధవారం పుష్కర బృహస్పతి గాయత్రీ యాగాన్ని కొనసాగింది. ఎగువ ఉమామహేశ్వరాలయంలో విశేష పూజలు చేపట్టారు. సాయంత్రం 6గంటల సమయంలో పుష్కర జలాలకు సంధ్యాహారతి ఇచ్చారు. మహిళలు సప్తనదీ జలాల్లో దీపాలు వదిలారు. బుధవారం సుమారు 900 మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. పుష్కర ఏర్పాట్లను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రమోహన్, డ్వామా పీడీ వెంగన్న, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో శ్రీరాములు, దేవస్థానం ఈవో నాగప్రసాద్ ఎప్పటికప్పుడు పర్యవే క్షించారు.
తానా ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ
కర్నూలు(కల్చరల్), నవంబరు 25: తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా (తానా) ఆధ్వర్యంలో పుష్కర భక్తులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. స్థానిక సంకల్‌బాగ్‌లో నిత్యం ఆరువేల మంది భక్తులకు అందజేస్తున్నారు. పుష్కరాలు ఆరో రోజున బుధవారం మధ్యాహ్నం సంకల్ బాగ్ ఘాట్‌కు విచ్చేసిన వివిధ ప్రాంతాల భక్తులకు పొట్లాలు పంపిణీ చేశారు. పన్నెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తానా కార్యదర్శి రవి పొట్లూరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.