వైసీపీ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం

ABN , First Publish Date - 2020-11-19T05:40:22+05:30 IST

waste in ycp administration

వైసీపీ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం
మాట్లాడుతున్న ఫరూక్‌

  1. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌ 


నంద్యాల, నవంబరు 18: రాష్ట్రంలో వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌ మండిపడ్డారు. నంద్యాల పార్లమెంట్‌ జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కమిటీ ఎన్నిక కార్యాచరణ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, పార్టీ పరిశీలకుడు ప్రభాకర్‌ చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌ రెడ్డి, గౌరు చరితారెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, నాయకులు మాండ్ర శివానందరెడ్డి, కేఈ ప్రతాప్‌, ఎన్‌ఎండీ ఫిరోజ్‌, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫరూక్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ కక్షసాధింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని, వాయిదాకు ముందు జరిగిన ఎన్నికల ప్రక్రియలో గెలుపు కోసం వైసీపీ చేసిన దౌర్జన్యాలను పరిగణలోనికి తీసుకోవాలని ఎస్‌ఈసీకి విన్నవించారు.


ప్రజా పోరాటాలకు కార్యాచరణ: గౌరు వెంకటరెడ్డి

ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని గౌరు వెంకటరెడ్డి అన్నారు. తొలగించిన రేషన్‌ కార్డులను పేదలకు తిరిగి మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని అన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని, ఎత్తును తగ్గించరాదని అన్నారు. సలాం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని వైద్య కళాశాలకు కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కల్వకుర్తి-నంద్యాల హైవేపై ప్రకాశం బ్యారేజీ తరహాలో ఆనకట్టను నిర్మించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పార్లమెంట్‌ స్థాయిలో నూతన కార్యవర్గాలను ఎంపిక చేస్తున్నామని వెల్లడించారు. 

Updated Date - 2020-11-19T05:40:22+05:30 IST