భూ పందేరం!

ABN , First Publish Date - 2020-08-12T09:40:45+05:30 IST

రైతుల భూములు, ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా పంచేశారు. ముడుపులు ఇస్తే చాలు రికార్డులను మార్చేశారు. ఎకరానికి రూ.

భూ పందేరం!

ముడుపులు తీసుకుని రాసిచ్చారు

ప్రభుత్వ, ప్రైవేటు భూములు మాయం

ఆలయ భూములు, పోరంబోకులనూ వదల్లేదు

గని గ్రామంలో రెవెన్యూ అధికారుల అక్రమాలు


గడివేముల, ఆగస్టు 11:  రైతుల భూములు, ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా పంచేశారు. ముడుపులు ఇస్తే చాలు రికార్డులను మార్చేశారు. ఎకరానికి రూ.30 వేలు నుంచి రూ.50 వేలు వసూలు చేసి వందలాది ఎకరాల భూములను రాసిచ్చేశారు. కొండలు, వాగులు, పోరంబోకు భూములు, ఆలయ భూములు, ప్రభుత్వ భూములు అనే తేడా చూపలేదు. గడివేముల మండలం గని, చెనకపల్లి, చిందు కూరు, గడిగరేవుల గ్రామాల్లో జరిగిన అక్రమాలు ఇవి.


గని గ్రామ పరిధిలో మెగా సోలార్‌ పార్క్‌ ఏర్పాటైంది. గని గ్రామ పరిధిలో 2,479 ఎకరాలను  ఈ పరిశ్రమకు కేటాయించారు. ఇందులో వాగులు, రస్తాలు, ప్రభుత్వ భూములు, డి పట్టా, పట్టా భూములు ఉన్నాయి. భూ యజమానులకు పరిహారంగా ఎకరానికి రూ.5 లక్షలు ఇచ్చారు. పాణ్యం మండలం పిన్నాపురంలో సోలార్‌ పరిశ్రమ కోసం గడివేముల మండలంలోని చెనకపల్లి గ్రామానికి చెందిన భూములను కేటాయించారు. దీంతో ఇక్కడి భూమికి రెక్కలు వచ్చాయి. ప్రభుత్వ భూములను తమ పేర రాయించుకుంటే రూ.లక్షలు వస్తాయన్న ఆశతో కొందరు అక్రమాలకు తెరలేపారు.


వారే కీలకం..

గడివేముల మండలంలోని కొందరు రెవెన్యూ అధికా రులు, గని చెందిన ఒక వ్యక్తి, రెవెన్యూ శాఖలో అవినీతి మరకలు అంటిన మరొకరు భూ పందేరంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసి వందలాది ఎకరాలను పంచేశారు. గడివే ములతో పాటు ఇతర మండలాల వారి పేరిట ఆన్‌లైన్‌లో భూములను నమోదు చేశారు.

 

దేన్నీ వదల్లేదు

ఫ గని గ్రామస్థులు 927/4 సర్వే నెంబరులోని ప్రభుత్వ భూమిలో చెంచు నాగమయ్య గుడి నిర్మించి పూజలు చేస్తున్నారు. ఆలయంలో పూజల కోసం కొంత భూమిని కేటాయించుకున్నారు. ఆ భూమిని అధికారులు మరొకరికి ఆన్‌లైన్‌ చేశారు.


ఫ గని గ్రామానికి చెందిన శంకర్‌కు 537-1 సర్వే నెంబరులో 6.08 ఎకరాల పట్టా భూమి ఉంది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌, అడంగల్‌, పాసు పుస్తకాలు ఉన్నాయి. ఆ భూమిలో 1.84 ఎకరాలను అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి పేరిట ఆన్‌లైన్‌ చేశారు. 


ఫ 1,111 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ భూమిని వైకే తండా రైతులు సాగు చేసుకుంటున్నారు. దీన్ని వేరే మండలాలకు చెందిన వారికి ఆన్‌లైన్‌ చేశారు. 


ఫ గని గ్రామంలోని 564 సర్వే నెంబర్‌లో 36.80 ఎకరాల వాగు పొరంబోకు భూమి ఉంది. దీన్ని గని గ్రామానికి చెందిన కొందరు సాగు చేసుకుంటున్నారు. తమకు పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరినా స్పందించలేదు. వాగు పొరంబోకు పట్టాలు ఇవ్వడానికి కుదరదని చెప్పేవారు. కానీ ఇదే భూమిని ఇతర మండలాలకు చెందిన కొందరు వ్యక్తుల పేరిట ఆన్‌లైన్‌ చేశారు.


వెబ్‌ల్యాండ్‌లో అక్రమాలు

రెవెన్యూ సేవలలో పారదర్శకత, అవినీతి రహిత కార్యకలాపాల కోసం ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌ను ఏర్పాటు చేసింది. భూములు మార్పు లు, చేర్పులు చేసేందుకు తహసీల్దార్‌కు డిజిటల్‌ కీని ఇచ్చారు. పకడ్బం దీగా ఉండే వెబ్‌ల్యాండ్‌లో మార్పులు, చేర్పులను ఇష్టాను సారంగా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు తెలియకుండా పట్టా భూముల్లో మార్పులు చేస్తున్నారు. ఈ అక్రమాలన్నీ గని గ్రామ స్థులకు తెలియడంతో అధికారులు ప్రభుత్వ సెలవు రోజైన మంగళవారం డిజిటల్‌ సైన్‌ను తొలగించారు. దీంతో అక్రమంగా రాసిచ్చిన భూములకు రెడ్‌మార్క్‌ చూపిస్తోంది. 


మరొకరికి రాసిచ్చారు..

531/1 సర్వే నెంబర్‌లో మాకు 6.08 ఎకరాల భూమి ఉంది. వారసత్వంగా మా నాన్న నుంచి నాకు వచ్చింది. అన్ని ఆధారాలు ఉన్నాయి. నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. 1.24 ఎకరాలను మరొకరి పేరిట ఆన్‌లైన్‌ చేశారు. అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలి.

                                             - శంకర్‌, గని గ్రామస్థుడు


 ఆలయ భూమిని రాసిచ్చారు

927/4 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమిని గ్రామ పెద్దలు చాలా ఏళ్ల కిందట చెంచు నాగమయ్య గుడికి కేటాయించారు. ఈ భూమిలో పంటలు సాగు చేసి వచ్చిన నగదుతో స్వామికి పూజలు చేసేవాళ్లం. ఈ భూమిని మరోకరికి ఆన్‌లైన్‌ చేశారు. 

                                      - దాసరి పుల్లయ్య, గని, పూజరి


వాగు పొరంబోకు.. 

గని గ్రామంలోని 564 సర్వే నెంబర్‌లో వాగు పొరంబోకు ఉంది. ఈ భూమిలో మా పెద్దల కాలం నుంచి సాగు చేసుకుంటున్నాం. అదే మాకు జీవనాధారం. పట్టా ఇవ్వమని అడిగినా అధికారులు స్పందించలేదు. ఇప్పుడు ఇతర మండలాల్లోని వ్యక్తులకు ఆన్‌లైన్‌ చేశారు. 

                                         - గంగన్న, రైతు, గని గ్రామం

 

విచారణ చేపట్టాలి..

గని గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఏళ్ల నుంచి రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. వారికి పట్టాలు ఇవ్వకుండా ఇతర మండలాలు, గ్రామాలకు చెందిన వారికి పట్టాలు ఇస్తున్నారు. వాగు పొరంబోకులను, పట్టా భూములను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. రెవెన్యూ అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలి. 

                        - ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ, గని గ్రామం 


విచారణ చేస్తున్నాం: గని గ్రామంలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్నాం. బాద్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. 

                                               - ఇంద్రాణి, తహసీల్దార్‌ 

Updated Date - 2020-08-12T09:40:45+05:30 IST