తాగిన మైకంలోనే పిల్లల కిడ్నాప్‌

ABN , First Publish Date - 2020-11-28T05:00:42+05:30 IST

మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చిన్నారుల కిడ్నాప్‌ల కలకలం కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు.

తాగిన మైకంలోనే పిల్లల కిడ్నాప్‌

కర్నూలు, నవంబరు 27: మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చిన్నారుల కిడ్నాప్‌ల కలకలం కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ మహేష్‌, మూడో పట్టణ సీఐ తబ్రేజ్‌ శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితుడు అనీఫ్‌ను మీడియా ఎదురుగా హాజరు పరిచారు. కర్నూలు బిర్లాగడ్డకు చెందిన అనీఫ్‌ డోన్‌ ఇందిరాగాందీ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కర్నూలు చిల్డ్రన్స్‌ పార్కు వద్ద ఉన్న ఆర్‌ఆర్‌ ఆటో మొబైల్స్‌ షాపులో బైక్‌ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి చిన్న పిల్లలను మొటర్‌ సైకిల్‌పై తిప్పే అలవాటు ఉంది. మూడు రోజుల క్రితం తాను పని చేసే షాపుకు రిపేర్‌ కోసం వచ్చిన మౌలి అనే వ్యక్తి మోటార్‌ సైకిల్‌ తీసుకుని సరాదాగా స్వామిరెడ్డినగర్‌కు వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో సమీపంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ కనిపించారు. వారిద్దరికి చాక్లెట్‌ కొనిస్తానని, ఒక రౌండ్‌ బైక్‌పై తిప్పుతానని నమ్మించాడు. ఆ ఇద్దరు పిల్లలను మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని చాలా వేగంతో బైక్‌ నడిపాడు. స్థానిక వినాయక గుడి వద్ద ఆ ఇద్దరు పిల్లలు కింద పడిపోగా మరో బాలికను తీసుకుని నంద్యాల చెక్‌పోస్టు వైపు వెళ్తున్నాడు. ఆ బాలిక భయంతో కేకలు వేయడంతో బాలికను దింపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుని అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ రహంతుల్లా, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

Updated Date - 2020-11-28T05:00:42+05:30 IST