సాధ్యమేనా?

ABN , First Publish Date - 2020-03-18T11:13:02+05:30 IST

పారాసిట్మాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌తో కోవిడ్‌-19 వైర్‌సను పారదోలవచ్చన్న రాష్ట్ర ప్రభుత్వం అడుగుజాడల్లో జిల్లా యంత్రాంగం నడుస్తోంది.

సాధ్యమేనా?

వైద్య పరీక్షలకు నలుగురు వైద్యుల బృందం

శ్రీశైలానికి లక్షలాది మంది భక్తులు

కంటి తుడుపుగా చెక్‌పోస్టు వైద్య పరీక్షలు

కరోనా నివారణపై జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం 


కర్నూలు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): పారాసిట్మాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌తో కోవిడ్‌-19 వైర్‌సను పారదోలవచ్చన్న రాష్ట్ర ప్రభుత్వం అడుగుజాడల్లో జిల్లా యంత్రాంగం నడుస్తోంది. చెక్‌పోస్టుల ద్వారా కరోనాను జిల్లాలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఉగాది ఉత్సవాలకు రాబోయే లక్షలాది భక్తులకు కంటి తుడుపు పరీక్షలు చేసి చేతులు దులుపుకోబోతుంది. జిల్లా శివార్లలో 7 చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి, ఒక్కో చోట ఒక్కో వైద్య బృందంతో కరోనా ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. భక్తులకు వైరస్‌ లేదన్న నమ్మకం కుదిరాకే శ్రీశైలానికి అనుమతిస్తామని అధికార యంత్రాంగం మంగళవారం ప్రకటించింది.


అయితే ఇది కచ్చితంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందని పలువురు వైద్య నిపుణులు అంటున్నారు. శ్రీశైలానికి రోజుకు సుమారు 30-40 వేల మంది వచ్చి వెళ్తుంటారు. వారికి ఒక్కో చెక్‌పోస్టు వద్ద నలుగురు సభ్యులున్న వైద్య బృందం కరోనా ప్రాథమిక టెస్ట్‌లు చేయడానికి సిద్ధమైంది. నిజానికి అన్ని వేల మందికి పరీక్షలు చేయాలంటే ఏకంగా 120 రోజులు సమయం పడుతుంది. ఇంత అసాధ్యమైన పనిని చేసి చూపిస్తామని అధికార గణం అంటోంది. తూతూ మంత్రంగా పరీక్షలు చేసి వేలాది మంది భక్తులను శ్రీశైలానికి పంపబోతున్నారు. తద్వారా వారం పాటు రద్దీగా జరిగే ఈ ఉత్సవాల్లో వైరస్‌ విస్తృతంగా వ్యాప్తించే ప్రమాదం పొంచి ఉంది. 


లక్షలాది మంది భక్తులు

మార్చి 22 నుంచి 26 వరకు శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు జరుగుతాయి. ఏటా ఈ ఉత్సవాలకు 4-5 లక్షల మంది భక్తులు వస్తుంటారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆ సంఖ్య గణనీయంగా తగ్గి 2 లక్షల మంది మాత్రమే వచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. 22న ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు ఇప్పటికే కాలినడక, వాహనాల ద్వారా భక్తుల రద్దీ మొదలైంది. ఈ ఉత్సవాల సందర్భంగా నిత్యం శ్రీశైలానికి కర్నూలు బస్‌ డిపో ద్వారా 7వేల మంది ప్రయాణిస్తుంటారు. జిల్లాలోని 11 బస్‌ డిపోలు, ఇతర డిపోల(హైదరాబాద్‌, కర్ణాటక) నుంచి అయితే 42 వేల మంది దోర్నాల మీదుగా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ వ్యాపించకుండా కర్నూల్లోకి, శ్రీశైలానికి భక్తులు ప్రవేశించే 7 ప్రాంతాల్లో ఏడు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లుగా కలెక్టర్‌ కార్యాలయం ప్రకటించింది. ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఒక మెడికల్‌ ఆఫీసర్‌తో పాటు 3-4 అసిస్టెంట్ల బృందం పనిచేస్తుంది. అయితే నిత్యం ప్రయాణించే 50 వేల మందికి వైద్య పరీక్షలు అయ్యే పనేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ఒక్కొక్కరికి వైద్య పరీక్షలు చేయాలంటే కనీసం 4 నిమిషాలుపడుతుంది. ఈ లెక్కన కనీసం 120 రోజుల పాటు పరీక్షలకు పడుతుంది. ఇలా రోజుల తరబడి వచ్చే భక్తులకు పరీక్షలు చేయాలంటే ఇంకెంత సమయం పడుతుందనే అంచనా లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా పరీక్షలు నిర్వహించినంత సేపు చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని నిలబెట్టాలి. దీని వల్ల పరీక్షలు అయ్యేలోగా కిలోమీటర్ల మేర వాహన రద్దీ ఏర్పడుతుంది. 


తూతూమంత్రంగా పరీక్షలు 

సాధారణంగా కరోనా నిర్ధారణకు రక్త పరీక్ష, శ్వాబ్‌ టెస్ట్‌, నాసికా రంధ్రాల్లోని వ్యర్థాల సేకరణ, ఊపిరితిత్తుల్లోని వ్యర్థ నమూనాలు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని సేకరించి ఐదు రకాల పరీక్షలు చేస్తారు. అప్పుడుగాని పూర్తి స్థాయి వ్యాధి నిర్ధారణ చేయలేరు. అయితే ఈ చెకపోస్టుల్లో కరోనా ప్రాథమిక పరీక్షలు మాత్రమే చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ పరీక్షల వల్ల వ్యాధి నిర్ధారణ అసాధ్యమనే చెప్పాలి. అలాగే ఈ ప్రాథమిక పరీక్షల్లో థర్మల్‌ ఫీవర్‌ పరీక్షలు మాత్రమే నిర్వహించే అవకాశం ఉందని పలువురు వైద్యులు వివరిస్తున్నారు.


వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఈ పరీక్షల ద్వారా జ్వరం ఉందో.. లేదో తెలుసుకోగలమే తప్ప ఆ జ్వరం కరోనా వైరస్‌ వల్లే వచ్చిందనే నిర్ధారించడం అయ్యే పని కాదు. సాధారణంగా జ్వరం వచ్చిన వ్యక్తులు దూర ప్రయాణాలకు ఇష్టపడరు. ప్రయాణ అలసట, ఇతర ఇబ్బందుల వల్ల జ్వరం వచ్చిన వాళ్లకే ఈ పరీక్షలు ఉపయోగిపడతాయి. దీని వల్ల లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు వైరస్‌ నుంచి భద్రత కల్పించలేరని స్పష్టమవుతోంది. వైరస్‌ విస్తరించకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు ఈ కంటి తుడుపు చర్యలతో సరిపెట్టుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. 

 

ప్రభుత్వ స్పందన శూన్యం

 వైద్య అవసరాలకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక స్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం తీసుకోవాలి. కానీ వైరస్‌ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకూ ఎలాంటి వినతులు వెళ్లలేదు. ఇప్పటికి కేంద్రం నుంచి కూడా ఒక్క నయాపైసా రాష్ట్ర ఖజానాలో పడలేదు. ఫలితంగా కర్నూలు జిల్లాకు కూడా నిధులు శూన్యమేనని చెప్పాలి. కరోనా నివారణ చర్యలు ఏమీ తీసుకోలేదనిపించుకోకుండా ఏదో ఒకటి చేశామనే పేరు కోసమే అధికారులు ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశాకనే జిల్లా యంత్రాంగానికి కరోనా ప్రాథమిక పరీక్షల ఆలోచన రావడం కొసమెరుపు. 


చెక్‌పోస్టులు.. బస్సు ప్రయాణాలు

సంఖ్య కౌతాళం-బాపురం 3 బస్పులు 4 ట్రిప్పులు 

1. బళ్లారి వద్ద క్షేత్రగుడి 10 బస్పులు 4 ట్రిప్పులు

2. మాధవరం 13 బస్సులు 4 ట్రిప్పులు

3. పెద్ద హరివాణం 13 బస్సులు 4 ట్రిప్పులు

4. మార్లమడిక 4 బస్సులు 4 ట్రిప్పులు

5. సుంకేసుల 16 బస్సులు 4 ట్రిప్పులు

6. పంచలింగాల 74 బస్సులు 4 ట్రిప్పులు

మొత్తం 133 బస్సులు 28 ట్రిప్పులు

ఇవి గాక జిల్లాలోని 12 డిపోలు, కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చే బస్సులు, ప్రయాణికుల సంఖ్య అదనం.

Updated Date - 2020-03-18T11:13:02+05:30 IST