గూడు కూల్చారు

ABN , First Publish Date - 2020-03-13T11:53:41+05:30 IST

ఆత్మకూరు మండలం కురుకుంద శివారులో కొట్టాలచెరువు గూడెం చెంచులకు 35 ఏళ్ల కిందట ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చింది.

గూడు కూల్చారు

దారి కోసం వైసీపీ నాయకుల దాష్టీకం

రోడ్డున పడ్డ గిరిజన కుటుంబాలు

కురుకుంద గ్రామంలో దారుణం

ఆత్మకూరు తహసీల్దార్‌కు ఫిర్యాదు


ఆత్మకూరు, మార్చి 12: ఆత్మకూరు మండలం కురుకుంద శివారులో కొట్టాలచెరువు గూడెం చెంచులకు 35 ఏళ్ల కిందట ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ పది కుటుంబాలు జీవిస్తున్నాయి. చెంచుల ఇళ్లకు సమీపంలో కురుకుంద గ్రామస్థులకు ఇంటి స్థలాలను ఇస్తున్నారు. 4.16 ఎకరాలలో సుమారు 160 మందికి స్థలాలు ఇచ్చేలా లే అవుట్లను సిద్ధం చేశారు. ఈ ప్రాంతానికి చేరుకునేందుకు పక్కన మరో రహదారి ఉన్నా, అనుకూలమైన దారి పేరిట అధికార పార్టీ నాయకులు చెంచుల గృహాలను కూల్చివేశారు. కనీసం వీఆర్వో ద్వారా సంప్రదింపలు కూడా జరపలేదు. గిరిజనులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మూడు రోజుల క్రితం ఐదు ఇళ్లను కూల్చివేశారు. దీంతో బాధితులు చెట్ల కింద జీవనం సాగిస్తున్నారు. ఈ విషయం గిరిజన ఉద్యోగ సంఘం నాయకుల దృష్టికి వెళ్లడంతో గురువారం వారు గూడేనికి వెళ్లారు. బాధితుల గోడు విని, వారిని తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ చంటి బిడ్డలతో చెంచులు నిరసన తెలిపారు.


తహసీల్దార్‌ ఆదినారాయణకు తమ తమ కష్టాల్ని వినిపించారు. 35 ఏళ్లుగా ఉంటున్న గృహాలను కూల్చివేసి తమను రోడ్డుకు ఈడ్చారని వాపోయారు. ఈ సందర్భంగా గిరిజన ఉద్యోగ సంఘం నాయకులు జవహర్‌నాయక్‌, పరమేశ్‌ మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక విధాలుగా కృషి చేస్తుంటే క్షేత్రస్థాయిలో గిరిజనులను వేధించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వైసీపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శ్రీశైలం ఐటీడీఏ అధికారులు బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై స్పందించిన తహసీల్దార్‌ ఆదినారాయణ వెంటనే కురుకుంద వీఆర్వోను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గ్రామానికి చేరుకుని కూల్చివేసిన గృహాలను పరిశీలించారు. చెట్ల కింద గడుపుతున్న చెంచులను చూసి చలించిపోయారు. తక్షణమే వారికి పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 


రోడ్డుకు ఈడ్చేశారు.. అర్తి మూగమ్మ

నా భర్త మరణించారు. ఇద్దరు చంటి బిడ్డలతో జీవనం సాగిస్తున్నాను. మా ఇంటిని కూల్చివేసి మమ్మల్ని రోడ్డున పడేశారు. చెట్ల కిందే జీవనం సాగించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఇదేమిటని ప్రశ్నించినా మా గోడు వినలేదు. అధికారులు మాకు న్యాయం చేయాలి. 

 

35 ఏళ్లుగా ఉంటున్నాము.. గూళ్ల లింగమ్మ

కురుకుంద శివార్లలో 35 ఏళ్లుగా పక్కా గృహాల్లో జీవనం సాగిస్తున్నాయి. రస్తా పేరిట మా ఇళ్లను కూల్చివేశారు. మేము రోడ్డున పడ్డాము. ఇదేమిటని ప్రశ్నిస్తే త్వరలో ఇళ్లు నిర్మిస్తామని చెబుతున్నారు. అప్పటి వరకు మేము ఎక్కడ ఉండాలి..? చెంచులంటే అందరికీ అలుసైపోయింది. ఐటీడీఏ అధికారులు మా కష్టాలను తీర్చాలి. 

 

చంటిబిడ్డలతో అవస్థలు..గూళ్ల చిన్నలింగమ్మ

ఇళ్లను కూల్చివేయడంతో చంటిబిడ్డలతో అవస్థలు పడుతున్నాము. ఒకరిద్దరు బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. మరికొందరు చెట్ల కిందే దుర్భర జీవనం సాగిస్తున్నారు. మొదట గూడేంలో శిథిలమైన గృహాలను మాత్రమే తొలగిస్తామని అన్నారు. ఆ తర్వాత నివాస గృహాలను కూడా కూల్చివేశారు. వద్దని వేడుకున్నా పట్టించుకోలేదు. 


Updated Date - 2020-03-13T11:53:41+05:30 IST