రంగు పూసి దొంగతనం
ABN , First Publish Date - 2020-11-03T10:10:08+05:30 IST
ఏటీఎంలలో దొంగలు పడ్డారు. ఆనవాళ్లు తెలియకుండా సీసీ కెమెరాలకు రంగు పూశారు. ఓర్వకల్లు, కర్నూలులో ఒకే గ్యాంగ్ చోరీలు చేసింది.
రెండు ఏటీఎంలలో చొరబాటు
రూ.5 లక్షలకు పైగా నగదు చోరీ
ఓర్వకల్లు/కర్నూలు, నవంబరు 2: ఏటీఎంలలో దొంగలు పడ్డారు. ఆనవాళ్లు తెలియకుండా సీసీ కెమెరాలకు రంగు పూశారు. ఓర్వకల్లు, కర్నూలులో ఒకే గ్యాంగ్ చోరీలు చేసింది. ఓర్వకల్లు మండలం నన్నూరు బస్‌స్టేజీ సమీపంలో ఇండియన్-1 ఏటీఎంలోకి సోమవారం తెల్లవారు జామున ముగ్గురు దొంగలు చొరబడ్డారు. మొదట సీసీ కెమెరాలకు ఎరుపు రంగు పూశారు. ఆ తరువాత గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను పగులగొట్టి రూ.2,77,400 నగదు ఎత్తుకుపోయారు.
ఆ తరువాత కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ సమీపంలో జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో ఉన్న ఇండియా-1 ఏటీఎం కేంద్రంలో చొరబడ్డారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసి రూ.2.48 లక్షలు తీసుకుని ఉడాయించారు. దుండగులు టాటా సుమో వాహనంలో వచ్చి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఓర్వకల్లులో రాత్రి 2 గంటలకు, కర్నూలులో 2.40 గంటలకు చోరీ చేసినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా గుర్తించారు. కానీ రంగు పూయడంతో వారి ఆనవాళ్లు అందులో కనిపించలేదు.
ఏటీఎం జోనల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు నాలుగో పట్టణ సీఐ శ్రీనివాస రెడ్డి తెలిపారు. కర్నూలు రూరల్ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఓర్వకల్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఏటీఎంను పరిశీలించారు. క్లూస్ టీం సీఐ శివారెడ్డి వేలిముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి పరిశీలించింది. నన్నూరు టోల్‌ప్లాజా వద్ద సీసీ ఫుటేజీని ఎస్‌ఐ తనిఖీ చేశారు. దీని ఆధారంగా దొంగలు ప్రయాణించిన వాహనాన్ని గుర్తించినట్లు తెలిసింది.