విద్యార్థులకు శిక్ష!

ABN , First Publish Date - 2020-10-31T06:50:23+05:30 IST

ఉపాధ్యాయ విద్య చదివేందుకు శిక్షణ ఇచ్చే డీఎడ్‌ ప్రైవేటు కళాశాలల యజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.

విద్యార్థులకు శిక్ష!

డీఎడ్‌ కళాశాలల్లో అడ్డుగోలు అడ్మిషన్లు

కోర్సు పూర్తయినా పరీక్షకు అనుమతి నిరాకరణ 

ఆందోళనలో విద్యార్థులు


కర్నూలు(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 30: ఉపాధ్యాయ విద్య చదివేందుకు శిక్షణ ఇచ్చే డీఎడ్‌ ప్రైవేటు కళాశాలల యజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థుల నుంచి రూ.లక్షలు వసూలు చేసుకుని డీఎడ్‌ ప్రవేశ పరీక్ష రాయకున్నా అడ్మిషన్లు ఇచ్చేశాయి. యాజమాన్యాలు చేసిన ఈ నేరానికి విద్యార్థులు శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చింది. మేనేజ్‌మెంట్‌ కోటా కింద రూ.లక్షల ఫీజు చెల్లించిన విద్యార్థులు ఇప్పుడు పరీక్షలకు అనర్హులయ్యారు. కాసులకు కక్కుర్తి పడి కొన్ని డీఎడ్‌ కళాశాలల యజమాన్యాలు అర్హత లేని, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చాయి. 2018-2020 విద్యా సంవత్సరానికి డీఎడ్‌ కోర్సు పూర్తయింది. కోర్సు పూర్తి అయినా పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది.


జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ డీఎడ్‌ కళాశాలలు 98 ఉన్నాయి. వీటిలో కన్వీనర్‌ కోటా కింద 2643 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, మేనేజ్‌మెంట్‌ కోటా కింద మరో 1700 మంది ప్రవేశం పొందారు. అయితే మేనేజ్‌మెంట్‌ కోటాలో క్వాలిఫికేషన్‌తో సంబంధం లేకుండా అడ్మిషన్‌ ఇచ్చారు. ఇలా స్పాట్‌ అడ్మిషన్‌ పేరుతో ప్రవేశాలు కల్పించడం సరికాదని ఇటీవల హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. డీసెట్‌ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించని, అసలు పరీక్షే రాయని వారికి ప్రవేశం ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది. డొనేషన్‌ తీసుకుని దొడ్డిదారిన అడ్మిషన్లు కల్పించకూడదని అన్నది. 2018-2020 విద్యాసంవత్సరానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండానే అడ్మిషన్లు ఏ అధికారంతో ఇచ్చారని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ కోటాలో అడ్మిట్‌ అయి కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం కోల్పోయారు. 


5 నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలు

2018-2020 విద్యా సంవత్సరానికి సంబంధించి డీఎడ్‌ కళాశాలల కన్వీనర్‌ కోటా కింద చేరి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు, గతంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు నవంబరు 5 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 2,646 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరికి అధికారులు 23 కేంద్రాలను సిద్ధం చేశారు. కర్నూలులో 11, ఆదోనిలో 3, డోన్‌లో 4, నంద్యాలలో 5 కేంద్రాలు ఉన్నాయి. అయితే యజమాన్యం కోటాలో డీఎడ్‌ చేరిన విద్యార్థులు అయోమయంలో పడ్డారు. రూ.లక్షల పీజులు చెల్లించి రెండు సంవత్సరాల కోర్సు పూర్తి చేశామని, తీరా పరీక్షలకు అనర్హులని అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పరీక్షల షెడ్యూల్‌ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నందు వల్ల ఇంత కాలం నిరీక్షిస్తూ వచ్చామని, తీరా ఇప్పుడు మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరామంటూ పరీక్షలకు అనుమతి నిరాకరించడం ఏమిటని ఆవేద వ్యక్తం చేస్తున్నారు. 


నేరం ఒకరు చేస్తే.. శిక్ష మరొకరికా?

మేనేజ్‌మెంట్‌ నేరం చేస్తే శిక్ష తమకా అని మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరిన విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు తమ భవిష్యత్‌ కోసం ఎన్నో కలలు కన్నారని, అప్పులు చేసి ఫీజులు చెల్లించి చదివించారని, తీరా కోర్సు పూర్తయ్యాక పరీక్షలకుఅనుమతి నిరాకరిస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు రాయనీయకపోతే తమకు ఆత్మహత్య తప్ప.. గత్యంతరం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం పునరాలోచించి పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి: కె.రామక్రిష్ణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు

డీఎడ్‌ కళాశాలల విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. లేదంటే విద్యార్థులు నష్టపోతారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రెండు సంవత్సరాల విద్యాసంవత్సరం నష్టపోతారు. కళాశాలలకు ప్రభుత్వ అనుమతి ఉందని అడ్మిషన్‌ తీసుకున్నారు. డీఎడ్‌ కళాశాలల యజమాన్యాలు తప్పు చేసి ఉంటే వాటిపై చర్యలు తీసుకోవాలి. అంతేగాని విద్యార్థులను ఇబ్బందిపెట్టడం తగదు. 


పరీక్షలకు అనుమతి నిరాకరించడం దారుణం: ఎం.శ్రీనివాసులు, డీఎడ్‌ ప్రైవైటు కళాశాలల యజమాన్య సంఘం కోశాధికారి

డీఎడ్‌ ప్రైవేటు కళాశాలల మేనేజ్‌మెంట్‌ కోటా కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఇవ్వకపోవడం దారుణం.  జీవో.నెం.30 ఎన్‌సీటీఈ రూల్స్‌కు వ్యతిరేకం. 2015 నుంచి ప్రతి సంవత్సరం పరీక్షకు అనుమతి ఇస్తున్నారు. 2018 నుంచి అనుమతి ఇవ్వలేదు. విద్యార్థులకు ప్రతి సంవత్సరం పరీక్ష నిర్వహించాలి. ప్రభుత్వం పరీక్ష నిర్వహించకపోగా, ఇప్పుడు అనుమతి ఇవ్వమంటే విద్యార్థుల పరిస్థితి ఏం అవుతుంది? 

Read more