వరికి తెగుళ్లు

ABN , First Publish Date - 2020-10-31T06:43:55+05:30 IST

అతివృష్టితో వరి రైతకు శాపంగా మారాయి. చాలా ప్రాంతాల్లో పైరు నీట మునిగి కుళ్లిపోయింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు అగ్గి, మెడ విరుపు తెగుళ్లు సోకుతున్నాయి.

వరికి తెగుళ్లు

పైరుకు మామిడి గుళ్ల, మెడవిరుపు

30 శాతం విస్తీర్ణంలో పంట నష్టం

భారీ వర్షాలు, అధిక తేమే కారణం

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు


నంద్యాల టౌన్‌, అక్టోబరు 30: అతివృష్టితో వరి రైతకు శాపంగా మారాయి. చాలా ప్రాంతాల్లో పైరు నీట మునిగి కుళ్లిపోయింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు అగ్గి, మెడ విరుపు తెగుళ్లు సోకుతున్నాయి. జిల్లాలో 30 శాతం పంటకు ఇప్పటికే తెగుళ్లు సోకాయి.  దీంతో పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 80 వేల హెక్టార్లలో వరి సాగు చే శారు. నంద్యాల డివిజన్‌లో అధికంగా 30 వేల హెక్టార్లలో సాగు చేశారు. భారీ వర్షాల కారణంగా ఇందులో 9 వేల హెక్టార్లలో పంట దెబ్బతినింది. 


పెరిగిన పెట్టుబడి

వరి సాగుకు ఈ ఏడాది పెట్టుబడి పెరిగింది. కరోనా విపత్తు సమయంలో నాట్లు వేయడంతో ఎకరాకు రూ.4500 వరకు కూలి ఖర్చులు వచ్చాయి. దీంతోపాటు ట్రాక్టర్‌ సేద్యాలు, ఎరువులు, మందుల వినియోగం పెరిగింది. ఇప్పటికే ఎకరం వరి సాగుకు రూ.20 వేల వరకు ఖర్చు చేశామని రైతులు అంటున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో తెగుళ్లు సోకడంతో ఆందోళన చెందుతున్నారు. 


రంగుమారిన కంకులు

మామిడి గుళ్ల తెగులు కారణంగా వరి కంకులపై పసుపు పచ్చ గుళ్లలు వచ్చాయి. కంకి  ఏర్పడే సమయంలో అధికంగా వర్షాలు కురిస్తే ఈ తెగులు వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జూన్‌, జూలైలో నాటు వేసిన పంటకు కంకి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కంకులు పసుపు రంగులోకి మారాయి. మందులు పిచికారీ చేసినా ఫలితం కనిపించడం లేదని రైతులు అంటున్నారు. 


మరిన్ని తెగుళ్లు

అతివృష్టి కారణంగా వరి పంటకు ఇతర తెగుళ్లు సోకుతున్నాయి. దోమపోటు కారణంగా తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు అంటున్నారు. దీంతో పాటు ఆకు పచ్చపురుగు నియంత్రణ కష్టమైందని ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అగ్గి, మెడ విరుపు తెగుళ్లు సోకాయి. దీంతో వరి కంకులు తాలగా మారాయి. మెడ విరుపు వచ్చిన పంటలో 40 శాతం పంట నష్టం జరిగింది.


తేమ అధికంగా ఉంటే.. రాజశేఖర్‌, నంద్యాల డివిజన్‌ వ్యవసాయ శాఖ అధికారి 

అధిక వర్షాలు, అధికంగా తేమ ఉన్న సమయంలో వరికి మామిడి గుళ్ల తెగులు వస్తుంది. దీని నివారణకు కాఫర్‌ ఆక్సీక్లోరైడ్‌ మందు పచికారీ చేయాలి. గుళ్ల నివారణ కష్టంగా ఉంటుంది. పెట్టుబడి కూడ రాదు..  మద్దిలేటి, వెంగళరెడ్డి పేట

నేను 27 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఇందులో 6 ఎకరాలు భారీ వర్షానికి నేల వాలింది. మిగిలి పంటకు మామిడి గుళ్ల వచ్చింది. అక్కడ అక్కడ మెడ విరుపు కారణంగా పంట దెబ్బతింటోంది. ఈ సంవత్సరం పెట్టుబడి కూడ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 

Read more