మళ్లీ ఇసుక కష్టం

ABN , First Publish Date - 2020-10-04T09:34:28+05:30 IST

సర్వర్‌ సమస్య కారణంగా ఆత్మకూరు ప్రాంతంలో ఇసుక దొరకడం లేదు. దీంతో భవన నిర్మాణ రంగం మళ్లీ కుదేలైంది. కార్మికులకు ఉపాధి కరువైంది. ఇళ్ల నిర్మాణాలు చేపట్టినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మళ్లీ ఇసుక కష్టం

15 రోజులుగా మొరాయిస్తున్న సర్వర్‌

ఉపాధి లేక కార్మికుల ఇబ్బందులు


ఆత్మకూరు, అక్టోబరు 3: సర్వర్‌ సమస్య కారణంగా ఆత్మకూరు ప్రాంతంలో ఇసుక  దొరకడం లేదు. దీంతో భవన నిర్మాణ రంగం మళ్లీ కుదేలైంది. కార్మికులకు ఉపాధి కరువైంది. ఇళ్ల నిర్మాణాలు చేపట్టినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక సులభంగా దొరికేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త పాలసీ అమలు చేస్తోంది. ఇసుక కావాల్సిన వారు ఆధార్‌ వివరాలతో సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. డబ్బులను ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనే జరుగుతోంది. ఆత్మకూరు మండలం, అర్బన్‌ పరిధిలో ఇసుక కేటాయింపుల ప్రక్రియకు 15 రోజులుగా సర్వర్‌ సమస్య తలెత్తింది.


దీంతో ఇసుక కొనుగోలు సమస్యగా మారిందని గృహ నిర్మాణదారులు వాపోతున్నారు. ఇసుక బుకింగ్‌ కోసం సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఎప్పటికి పరిష్కారమౌతుందో తెలియదని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఇబ్బంది లేదని, కేవలం ఆత్మకూరు ప్రాంతంలో సర్వర్‌ సమస్య రావడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటదాసును వివరణ కోరగా ఇసుక కేటాయింపుల ప్రక్రియ తమ పరిధిలో లేదని, రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళతానని అన్నారు. 

Updated Date - 2020-10-04T09:34:28+05:30 IST