పశువులకు వైరస్‌

ABN , First Publish Date - 2020-09-29T11:09:19+05:30 IST

పశువులకు ముద్ద చర్మపు వ్యాధి సోకుతోంది. దీంతో ఒళ్లంతా దద్దుర్లు ఏర్పడి పశువులు విలవిలలాడుతున్నాయి. లంపి స్కిన్‌ డిసీజ్‌(ఎల్‌ఎస్‌డీ) అని పిలిచే ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ లేదని పశువైద్యాధికారులు అంటున్నారు. ఈ వైరస్‌ సోకిన పశువులకు ఒళ్లంతా దద్దుర్లు

పశువులకు వైరస్‌

ఒళ్లంతా దద్దుర్లు.. పుండ్లు

మూగ జీవాలకు తీవ్ర అనారోగ్యం

వ్యాక్సిన్‌ లేదు.. భౌతిక దూరమే మందు


ఆదోని రూరల్‌, సెప్టెంబరు 22: పశువులకు ముద్ద చర్మపు వ్యాధి సోకుతోంది. దీంతో ఒళ్లంతా దద్దుర్లు ఏర్పడి పశువులు విలవిలలాడుతున్నాయి. లంపి స్కిన్‌ డిసీజ్‌(ఎల్‌ఎస్‌డీ) అని పిలిచే ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ లేదని పశువైద్యాధికారులు అంటున్నారు. ఈ వైరస్‌ సోకిన పశువులకు ఒళ్లంతా దద్దుర్లు ఏర్పడి పుండ్లుగా మారుతున్నాయి. కాళ్లు, గంగడోలు వాపు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ముక్కు నుంచి ద్రవం కారడం, జ్వరం సోకడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆదోని డివిజన్‌ పరిధిలోని 16 మండలాల్లో 1,57,923 తెల్ల పశువులు, 68,754 గేదెలు ఉన్నాయి. ఇప్పటి వరకు 5 వేలకు పైగా పశువులు ఈ వైరస్‌ బారిన పడ్డాయి. పది పశువుల వరకు మరణించాయి. 


నివారణ ఎలా..?

పశువులకు ముద్ద చర్మపు వ్యాధి (ఎల్‌ఎస్‌డీ) సోకకుండా రైతులు ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. గొర్రెలు, మేకలకు వినియోగించే వ్యాక్సిన్‌ను పశువులకు వేయడం ద్వారా ఈ వ్యాధిని కొంత వరకూ నివారించవచ్చని అంటున్నారు. తెల్లజాతి పశువులకు మాత్రమే ఈ వైరస్‌ సోకుతుందని, వైరస్‌ బారిన పడ్డ పశువులను మిగిలిన పశువులకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. వైరస్‌ బారిన పడ్డ పశువులకు వారం నుంచి 12 రోజుల పాటు యాంటీ బయాటిక్స్‌, కార్టిజోన్‌, యాంటీ ఇన్‌స్టమిన్‌ ఇంజెక్షన్లు వేయించాలని, పుండ్లు వచ్చిన చోట పూత మందు రాయాలని వైద్యులు సూచిస్తున్నారు. లివర్‌ టానిక్‌ వేయడం వల్ల కూడా ఈ వ్యాధిని నియంత్రించవచ్చని చెబుతున్నారు. 


నిర్లక్ష్యం చేయవద్దు 

ఎల్‌ఎస్‌డీ వైరస్‌కు మందు లేదు. తెల్లజాతి పశువుల్లో వ్యాప్తి చెందుతోంది. నివారణ కోసం గొర్రెలకు, మేకలకు వేసే వ్యాక్సిన్‌ వేస్తున్నాం. ఆదోని, హొళగుంద మండలాల పరిధిలో వెయ్యి వరకు పశువులు ఈ వైరస్‌ బారిన పడ్డాయి. వాటికి ఇంజెక్షన్లు వేస్తున్నాం. వ్యాధి నయం కావాలంటే 12 రోజులకు పైగా పడుతుంది. వైరస్‌ సోకిన పశువులను మిగిలిన పశువులతో కలపరాదు. క్రమం తప్పకుండా దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించాలి. 

                డాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి, సహాయ సంచాలకులు, వెటర్నరీ వైద్యశాల,                                                                                   ఆదోని


Updated Date - 2020-09-29T11:09:19+05:30 IST