నేటి నుంచి ప్లాస్టిక్ నిషేధం
ABN , First Publish Date - 2020-09-12T10:50:52+05:30 IST
పర్యావరణ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధిస్తున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ తెలిపారు. తన చాంబర్

నగరపాలిక కమిషనర్ డీకే బాలాజీ
కర్నూలు(అర్బన్), సెప్టెంబరు 11: పర్యావరణ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధిస్తున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ తెలిపారు. తన చాంబర్‌లో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. నగరంలో శనివారం నుంచి ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని, ధిక్కరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్టాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు తదితర వస్తువులను వినియోగించ వద్దని సూచించారు.
క్యారీ బ్యాగ్‌లు తయాచు చేసే కంపెనీలకు మొదటి తప్పుగా రూ.50 వేలు జరిమానా విధిస్తామని, పునరావృత మైతే లైసెన్సు రద్దు చేస్తామని తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను అమ్మే దుకాణదారులకు రూ.2,500 నుంచి 50,000 వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను బహిరంగ ప్రదేశాలు, డ్రైనేజీల్లో పడేస్తే రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా వస్త్ర, కాగితం, గోనె సంచులు వినియోగించుకోవాలని సూచించారు.
నగరంలోని దుకాణదారులు చెత్తను పారిశుధ్య కార్మికులకు అందించాలని, దీని కోసం నగర పాలక సంస్థ గెజిట్ అధారంగా ప్రతి నెలా కొంత రుసుము చెల్లించాలని సూచించారు. దుకాణాల బయట చెత్త నిల్వలు ఉంటే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.