యూరియా ఎక్కడ..!

ABN , First Publish Date - 2020-08-20T11:22:43+05:30 IST

జిల్లాలో సకాలంలో వర్షాలు కురిశాయి. పంటలకు ఇప్పుడు యూరియా అవసరం. కానీ తీవ్ర కొరత ఏర్పడింది. అవసరం మేరకు ప్రభుత్వం కే

యూరియా ఎక్కడ..!

జిల్లా వ్యాప్తంగా తీవ్ర కొరత

సరఫరాలో అధికారుల వివక్ష

రోడ్డెక్కుతున్న అన్నదాతలు


కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 19: జిల్లాలో సకాలంలో వర్షాలు కురిశాయి. పంటలకు ఇప్పుడు యూరియా అవసరం. కానీ తీవ్ర కొరత ఏర్పడింది. అవసరం మేరకు ప్రభుత్వం కేటాయించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన జిల్లాలకు ఒక న్యాయం.. కర్నూలుకు మరో న్యాయం అన్నట్లుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. ఆగస్టులో జిల్లాకు 32 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను కేటాయించారు.


కానీ 23 వేల టన్నులు మాత్రమే సరఫరా చేశారు. ఇంకా 9వేల టన్నులు రావాల్సి ఉంది. రైతులు రోడ్డెక్కుతుండటంతో సమాధానం చెప్పలేక వ్యవసాయ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మునుపెన్నడూ జిల్లాలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గందరగోళం

తాజా పరిస్థితిని డీలర్లు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు తెరతీశారు. బస్తాపై రూ.50 నుంచి రూ.100 దాకా పెంచి అమ్ముతున్నారు. జిల్లాకు కేటాయించిన ఎరువుల్లో సగం నిల్వలను మార్క్‌ఫెడ్‌ ద్వారా సహకార, ఇతర సంఘాల ద్వారా సరఫరా చేస్తుఉన్నారు. మిగిలిన 50 శాతం ఎరువులను ప్రైవేటు డీలర్లకు కేటాయిస్తున్నారు.


జిల్లాలో సహకరా సంఘాలకు, రైతుభరోసా కేంద్రాలకు సరఫరా అవుతున్న యూరియా, తదితర ఎరువులు పక్కదారి పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ జిల్లాకు కేటాయించిన యూరియాను  పూర్తి స్థాయిలో మార్క్‌ఫెడ్‌కే కేటాయించినట్లు తెలిసింది. దీంతో వ్యాపారులకు యూరియా అందడం లేదు. వివిధ మార్గాల ద్వారా యూరియాను సేకరించుకున్న ప్రైవేటు డీలర్లు  ధర పెంచి అమ్ముతున్నారు. 


పొరుగు జిల్లాకు మళ్లింపు..?

జిల్లాకు కేటాయించిన యూరియాలో కొంత పక్క జిల్లాలకు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల క్రిప్‌కో కంపెనీ నుంచి జిల్లాకు రావాల్సిన యూరియాను పక్క జిల్లాకు మళ్లించారని రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గతంలో మాదిరి మార్క్‌ఫెడ్‌తో పాటు ప్రైవేటు డీలర్లకు ఎరువులు కేటాయించి ఉంటే రైతులకు సక్రమంగా యూరియా అందేదని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. 

Updated Date - 2020-08-20T11:22:43+05:30 IST