వైభవంగా కాశిరెడ్డి నాయన ఆరాధనోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-07T05:15:42+05:30 IST

మండలంలోని ఆల్వకొండ క్రాస్‌ రోడ్డు వద్ద వెలిసిన కాశిరెడ్డినాయన ఆరాధనోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి.

వైభవంగా కాశిరెడ్డి నాయన ఆరాధనోత్సవాలు
బండను లాగుతున్న ఎద్దులు

  1. హోరాహోరీగా సాగిన ఎద్దుల పోటీలు

సంజామల, డిసెంబరు 6: మండలంలోని ఆల్వకొండ క్రాస్‌ రోడ్డు వద్ద వెలిసిన కాశిరెడ్డినాయన ఆరాధనోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. అవుకు, సంజామల, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల తదితర మండలాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు అర్చనలు, హోమాలు నిర్వహించారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి సాదరంగా ఆహ్వానం పలికి సత్కరించారు. ఆశ్రమంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. స్వామి వారి ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులందరికి తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా గాడిద పందెలు, యువతకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. భక్తుల కాలక్షేపం కోసం చెక్కభజన, భక్తచింతామణి నాటక ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట ముక్కమళ్ల మాజీ సర్పంచ్‌ పోచా వెంకటరామిరెడ్డి, జడ్పీటీసీ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, పోచా శీలారెడ్డి, ఆకుమళ్ల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

 

విజేతలు కర్నూలు జిల్లా ఎద్దులు 

కాశిరెడ్డి నాయన ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీల్లో కర్నూలు జిల్లా ఎద్దులు విజేతగా నిలిచాయి. న్యూ కేటగిరీ విభాగంలో నిర్వహించిన పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి 14 జతల ఎద్దులు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గుంపరమానుదిన్నె గ్రామానికి చెందిన కుందూరు రాంభూపాల్‌రెడ్డికి చెందిన ఎద్దులు అత్యధిక దూరం బండను లాగి విజేతగా నిలిచాయి. ద్వితీయ బహుమతిని కడప రూరల్‌ రూతువారిపల్లెకు చెందిన విద్యాఓబుళరెడ్డికి చెందిన ఎద్దులు గెలుపొందాయి. మూడో బహుమతిని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరుకు చెందిన పెద్ది శివకాంత్‌రెడ్డికి చెందిన ఎద్దులు గెలుపొందాయి. నాలుగో బహుమతిని కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలకు చెందిన చింతలపల్లె వికాస్‌రాజ్‌కు చెందిన ఎద్దులు, ఐదో బహుమతిని కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కొత్తపల్లెకు చెందిన దుబ్బన్నకు చెందిన ఎద్దులు, ఆరో బహుమతిని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం రొటర్‌పురం గ్రామానికి చెందిన లక్ష్మయ్యయాదవ్‌కు చెందిన ఎద్దులు విజేతలుగా నిలిచాయి. ప్రఽథమ బహుమతి దాత రామచంద్రారెడ్డి రూ.50వేలు అందించారు. రెండో బహుమతి రూ.40వేలను కర్నూలు రవిశంకర్‌ ట్రేడర్స్‌ వారు అందించారు. మూడో బహుమతి రూ.30వేలు, నాలుగవ బహుమతి రూ.20వేలు, ఐదో, ఆరో  బహుమతులను విజేతలకు నిర్వాహకులు అందించారు. పోటీల వ్యాఖ్యాతగా మధుసూదన్‌రెడ్డి వ్యవహరించారు. 

Updated Date - 2020-12-07T05:15:42+05:30 IST