భక్తిశ్రద్ధలతో కనకదాసు జయంతి
ABN , First Publish Date - 2020-12-04T05:27:01+05:30 IST
జిల్లా కురువ సంక్షేమ సంఘం, కురువ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం కురువల ఆరాధ్యదైవం భక్త కనకదాసు 533వ జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

కర్నూలు (కల్చరల్), డిసెంబరు 3: జిల్లా కురువ సంక్షేమ సంఘం, కురువ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం కురువల ఆరాధ్యదైవం భక్త కనకదాసు 533వ జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎస్టీబీసీ కళాశాల క్రీడా మైదానం నుంచి వన్‌టౌన్, రాజ్ విహార్, కలెక్టరేట్ వరకు అక్కడి నుంచీ తిరిగి బీసీ భవన్ వరకు కనకదాసు చిత్రపటాన్ని వాహనంపై అలంకరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సంఘం గౌరవాధ్యక్షుడు, మాజీ జడ్పీ ఛైర్మన్ బత్తిన వెంకటరాముడు మాట్లాడుతూ కురువ కులస్థులంతా కనకదాసు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఐకమత్యంతో ఉన్నపుడే అన్ని విధాలా ఎదుగుతామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీల వారూ కురువ కులానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతామని అన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి బండారి శ్రీనివాసులు మాట్లాడుతూ కురువ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం జనాభాకు అనుగుణంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాది గవ్వలకుంట్ల లక్ష్మన్న, కురువ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పర్ల మహానంది, అధ్యక్షుడు బత్తిన కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు(ఎడ్యుకేషన్): జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక బిర్లాగేటు సంక్షేమ భవనంలో భక్త కనకదాసు జయంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ వీరపాండియన్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గుడూబాయి, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకురాలు రమాదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.చంద్రశేఖర్, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐడీ శిరీష, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి రమా, ఉద్యోగులు పాల్గొన్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): నగరంలోని బీసీ సంక్షేమ భవన్‌లో భక్త కనకదాసు జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు గుర్తింపు వచ్చిందని, ఇందులో భాగంగా బీసీల అభివృద్ధి కోసం కృషి చేసిన ఎంతో మంది నాయకుల జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకునే అవకాశం కలిగిందని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుడు రాం బాబు, మురళీమోహన్ పాల్గొన్నారు.