నేటి నుంచి జేఈఈ మెయిన్స్‌

ABN , First Publish Date - 2020-09-01T08:50:43+05:30 IST

జేఈఈ-2020 మెయిన్స్‌ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. కొవిడ్‌-19 నిబంధనలను దృష్టి

నేటి నుంచి జేఈఈ మెయిన్స్‌


ఆన్‌లైన్‌ పరీక్షకు సర్వం సిద్ధం

ఆలస్యమైతే అనుమతి లేదు


కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 31: జేఈఈ-2020 మెయిన్స్‌ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. కొవిడ్‌-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంది. పరీక్ష కేంద్రాల బయట, లోపల భౌతిక దూరం కోసం ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 82,748 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. మంగళవారం నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.


రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిప్టుల్లో ప్రవేశ పరీక్ష రాస్తారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి షిప్టు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండో షిప్టు పరీక్ష ఉంటాయి. కర్నూలు నగరంలో నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో ఉన్న సనత్‌నగర్‌ అయాన్‌ డిజిటల్‌ జోన్‌ ఐడీజడ్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. మొదటి షిప్టు విద్యార్థులు ఉదయం 7 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకుని తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 8.30 గంటలకు పరీక్ష కేంద్రం మెయిన్‌ గేటును మూసివేస్తారు. ఆ తరువాత వచ్చిన విద్యార్థులను అనుమతించరు.


పరీక్ష సమయం 3 గంటలు ఉంటుంది. రెండో షిప్టు విద్యార్థులు మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకుని పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 2 గంటల వరకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతినిస్తారు. జేఈఈ మెయిన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే అడ్మిట్‌ కార్డను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 


సూచనలు:  

 విద్యార్థులు పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలి.


 పరీక్ష సమయం పూర్తయ్యేవరకు పరీక్ష కేంద్రంలో నుంచి విద్యార్థులను బయటకు పంపించరు. 


 అడ్మిట్‌ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌ పోర్టు ఒరిజినల్స్‌ ఏదో ఒకటి వెంట తీసుకువెళ్లాలి.


 బాల్‌ పాయింట్‌ పెన్ను, అదనంగా ఒక పాస్‌ పోర్ట్‌ సైజు ఫొటో వెంట తీసుకుపోవాలి.


 బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు జామెంటరీ బాక్స్‌ సెట్‌, పెన్సిల్‌, రబ్బర్‌, క్రయాన్స్‌ వెంట తీసుకువెళ్లాలి. వాటర్‌ కలర్స్‌ వినియోగానికి అనుమతి లేదు.

 

 మొబైల్‌ ఫోన్లు, కాలిక్యులేటర్స్‌, బ్లూటూత్‌ డీవైజర్స్‌, గడియారాలు వంటి ఎలక్ర్టానిక్‌ పరికరాలకు అనుమతి లేదు.


 విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చేటప్పుడు కాళ్లకు బూట్లు ధరించరాదు.


పరీక్ష రాస్తున్నప్పుడు మాస్కు, చేతిగ్లౌజు ధరించడం తప్పనిసరికాదు. అవసరమైతే పరీక్ష కేంద్రం వద్ద అధికారులే అందజేస్తారు. 


 పరీక్ష కేంద్రంలోకి వాటర్‌ బాటిళ్లను, శానిటైజర్‌ను తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. 


 పరీక్ష కేంద్రం వద్ద రద్దీని నియంత్రించేందుకు రిపోర్టింగ్‌ టైం స్లాట్‌ను కేటాయిస్తారు. రిపోర్టు ఎప్పుడు చేయాలో అభ్యర్థికి అడ్మిట్‌ కార్డు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు. 


 99.4 డిగ్రీల ఫారెన్‌హీట్‌ శరీర ఉష్ణోగ్రత ఉన్నవారికి ఐసొలేషన్‌ గదిని కేటాయిస్తారు. ఆ గదిలోకి వెళ్లిన 20 నిమిషాల తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ మొదలు పెడుతారు. ఆ తర్వాత అభ్యర్థి శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 


 అభ్యర్థి అడ్మిట్‌ కార్డు, ఐడీ కార్డు, ఇతర డాక్యుమెంట్లను ఇన్విలేజటరుకు విధిగా చూపించాలి. ఏ ఒక్క డాక్యుమెంట్‌ను ఇన్విలిటేజర్‌ చేతితో ముట్టుకోరు. 


 వెరిఫికేషన్‌ అనంతరం పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు విద్యార్థి సబ్బు, శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. 

Updated Date - 2020-09-01T08:50:43+05:30 IST