-
-
Home » Andhra Pradesh » Kurnool » jagan is enemy to farmers
-
రైతు శత్రువు జగన్
ABN , First Publish Date - 2020-12-28T05:28:15+05:30 IST
సీఎం జగన్ రైతులకు శత్రువుగా మారారని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులపై కక్ష సాధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.

- కక్ష సాధింపు తప్ప అభివృద్ధి లేదు
- ప్రాజెక్టులకు ఒక తట్ట మన్నూ వేయలేదు
- సీఎంపై మాజీ ఎమ్మెల్యే బీవీ, సోమిశెట్టి ఫైర్
- పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ర్యాలీ
ఎమ్మిగనూరు, డిసెంబరు 27: సీఎం జగన్ రైతులకు శత్రువుగా మారారని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులపై కక్ష సాధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరులో ఆదివారం నిరసన ర్యాలీ చేపట్టారు. శ్రీనివాస సర్కిల్ నుంచి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం, సోమప్ప సర్కిల్ ఏర్పాటు చేసిన సభలో వారు ప్రసంగించారు.
రైతులను ఆదుకోవటంలో విఫలం
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏడుసార్లు వరదలు వచ్చాయని, పచ్చి కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని బీవీ అన్నారు. ఉల్లి, మిరప, వేరుశనగ, వరి వంటి పంటలు వర్షపునీటిలో మునిగి కుళ్లిపోయాయని, రైతుల గురించి అడిగే నాథుడే కరువయ్యాడని అన్నారు. గోనెగండ్ల మండలం అలువాలలో కౌలురైతు ఆత్మహత్య చేసుకుంటే స్థానిక ఎమ్మెల్యేగాని, అధికారులుగాని బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పశ్చిమ ప్రాంతానికి సాగునీటిని అందించేందుకు టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టులను చేపట్టకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబు చేత రూ.2 వేల కోట్లు మంజురు చేయించామని అన్నారు. ఏడాదిన్నర దాటినా ఆ పనుల్లో తట్టెడు మట్టి వేసిన పాపాన పోలేదని విమర్శిం చారు. తాజాగా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవు తోందని, బోర్లకు మీటర్లు బిగిస్తే అక్కడ సైకిల్ కడతామాని హెచ్చరించారు. ఇంటింటికి ఇసుక ఇస్తామని చెప్పిన సీఎం ఎవరిం టికి ఇసుక ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబా టు ధర కల్పించేవరకుపోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు.
కక్ష సాధింపులకు ప్రాధాన్యం
మంచి పాలన అందించాని ప్రజలు అధికారం ఇస్తే, 19 నెలలుగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై, టీడీపీ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని సోమిశెట్టి అన్నారు. టమోటా కిలో రూపాయకు రైతుల వద్ద కొని, మార్కెట్‌లో రూ.18కి అమ్ముతు న్నారని, దీనికి సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం హయాంలో కట్టిన భవనాలకు రంగులు మార్చి మంత్రులు ప్రారంభిస్తున్నారని విమర్శించారు. వేలకోట్ల అవినీతికి పాల్పడిన జగన్ జైలుకు పోయే సమయం దగ్గరలో ఉందని అన్నారు. త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయాని, తిరిగి తమకు అధికారం వస్తుందని అన్నారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని, సీఎంను నమ్మొద్దని, పొరపాటున నమ్మితే జైలుకు పంపుతారని అన్నారు. ఏమీ ఏరుగని డీజీపీని కోర్టుకు పంపించారని, అందరినీ జైలుకు పంపి తాను మాత్రం బాగుంటాడని అన్నారు. అనంతరం సోమప్ప సర్కిల్ రైతు సంఘాల చేస్తున్న దీక్షకు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. టీడీపీ నాయకులు మాధవరావ్ దేశాయ్, ఈరన్న గౌడ్, రామలింగా రెడ్డి, ఫరూక్, సీపీఐ, సీపీఎం నాయకులు పంపన్న గౌడ్, హనుమంతు, భాగ్యలక్ష్మి, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు.