ఇంకో మూడు రోజులు వర్షాలు

ABN , First Publish Date - 2020-09-16T09:52:09+05:30 IST

జిల్లాలో మరోమూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ జి వీరపాండియన్‌ సూచిం

ఇంకో మూడు రోజులు వర్షాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్‌ వీరపాండియన్‌ సూచన

ముంపు ప్రాంతాల్లో పర్యటన


ఆత్మకూరు, సెప్టెంబరు 15: జిల్లాలో మరోమూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం   ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ జి వీరపాండియన్‌ సూచించారు. ఆత్మకూరులోని వరద ప్రభావిత ప్రాంతాలైన సాయిబాబా నగర్‌, ఇందిరా నగర్‌, ఏకలవ్య నగర్‌, లక్ష్మీనగర్‌, అక్కిరాజు కాలనీల్లో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఎస్పీ ఫక్కీరప్పతో కలిసి మంగళవారం పర్యటించారు. అనంతరం గుండ్లకమ్మవాగును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..


జిల్లాలోని ఆత్మకూరు, కొత్తపల్లి, రుద్రవరం, బండి ఆత్మకూరు తదితర మండలాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరుచేరిందని, రోడ్లు, చెరువులు దెబ్బతిన్నాయని అన్నారు. వరద బాధితులకు సాయం అందిస్తున్నామని తెలిపారు. నిరాశ్రయులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రోడ్లు, చెరువులను బాగుచేయాలని పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించామని తెలిపారు. పంట నష్టాన్ని అంచనావేసి రైతులను ఆదుకుంటామని అన్నారు.


ఆత్మకూరులో వరద నష్టాలను ఎమ్మెల్యే శిల్పా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం, దాతల అందుతున్న సేవలను వివరించారు.  వర్షాలకు నష్టపోయిన ప్రజలు కలెక్టర్‌ ఎదుట గోడును వెల్లబోసుకున్నారు. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో సర్వం కోల్పోయామని, రాత్రిళ్లు నిద్రించేకి చోటు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో  ఈ సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం తరపున తమను ఆదుకోవాలని విన్నవించారు.


బాధితులను తప్పక ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ట్రైనీ ఎస్పీ కిషోర్‌, ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావు, తహసీల్దారు ఆదినారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటదాసు, సీఐ కృష్ణయ్య, ఆత్మకూరు, వెలుగోడు ఎస్‌ఐలు నాగేంద్ర ప్రసాద్‌, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-16T09:52:09+05:30 IST