ఆపగలరా..?

ABN , First Publish Date - 2020-05-29T10:32:34+05:30 IST

దశలవారీ మద్య నిషేధం.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట.. ఈ రెండూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు.

ఆపగలరా..?

పెరిగిన నాటు సారా తయారీ

పొరుగు మద్యంతో వ్యాపారం

రీచ్‌ల నుంచి ఇసుక పక్కదారి

ఎస్‌ఈబీ దాడుల్లో తేటతెల్లం


కర్నూలు, మే 25: దశలవారీ మద్య నిషేధం.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట.. ఈ రెండూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు. కానీ ఆశించిన ఫలితాలు రావడం లేదన్న అభిప్రాయం ఉంది. మద్యం ధరలను పెంచడం నాటు సారాకు బాటలు వేసింది. ప్రభుత్వమే ఇసుకను సరఫరా చేస్తున్నా.. యథేచ్చగా పక్కదారి పడుతోంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) దాడుల్లో నాటు సారా భారీగా బయట పడుతోంది. అక్రమంగా తరలుతున్న ఇసుక టన్నుల కొద్దీ వెలుగు చూస్తోంది. ఎస్‌ఈబీ తన పనిని ప్రారంభించిన వారం రోజుల్లోనే ఎన్నో అక్రమాలు వెలుగులో వచ్చాయి. 


యథేచ్చగా నాటుసారా తయారీ

కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో మద్యం దుకాణాలను ఇంకా తెరవలేదు. ఉన్న దుకాణాల్లో ప్రభుత్వ మద్యం ధరలు భగ్గుమంటున్నాయి. దీన్ని కొనలేనివారు నాటు సారా వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు కర్ణాటక, తెలంగాణ నుంచి దొడ్డిదారిన జిల్లాలోకి మద్యం వస్తోంది. ప్రభుత్వ మద్యంతో పోలిస్తే.. పొరుగు మద్యం, నాటు సారా తక్కువ ధరకు దొరుకుతోంది. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. కోడుమూరు, గూడూరు, ఆలూరు, చిప్పగిరి, ఆస్పరి, హోళగుంద పోలీస్‌స్టేషన్ల పరిధిలోని చెక్‌పోస్టుల వద్ద ఎస్‌ఈబీ గట్టి నిఘా పెట్టినా పొరుగు రాష్ట్రాల మద్యం తెస్తున్న వారిలో కొందరే పట్టుబడుతున్నారు. మరికొందరు గ్రామాల్లో దొరుకుతున్నారు. వీరిని వదిలేయాలని ప్రజాప్రతినిధులు పోలీసులకు సిఫార్సు చేస్తున్నారు. అడిషినల్‌ ఎస్పీ (ఎస్‌ఈబీ) గౌతమిశాలి ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలు, అక్రమ మద్యం, నిషేధిత వస్తువుల తరలింపు, విక్రయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అయినా మద్యం మాఫియా తగ్గడం లేదు. ఎస్‌ఈబీ ఏర్పాటు చేసిన తర్వాత అక్రమార్కులపై దాడులు పెరిగినా.. అదే స్థాయిలో తయారీ, విక్రయదారులు కూడా పెరుగుతున్నారు. 


ఇసుక అక్రమ రవాణా 

జిల్లాలో లాక్‌డౌన్‌ను అవకాశంగా తీసుకున్న ఇసుక మాఫియా రెచ్చిపోయింది. నదిచాగీ, గుడికంబాలి, రంగాపురం, అమృతాపురం ప్రాంతాల్లో మాత్రమే రీచ్‌లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇసుకను తరలించి డోన్‌, కర్నూలు పెద్దపాడు, బేతంచెర్ల, ఆదోని, నందికొట్కూరు డిపోలకు చేరుస్తున్నారు. తాడిపత్రి, కడప జిల్లాలోని కొన్ని రీచ్‌ల నుంచి ఇసుకను పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో డిపోలకు చేర్చి నిల్వ ఉంచారు. స్థానికులకు అందుబాటులో ఇసుకను ఉంచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా.. అక్రమార్కులకు ఇక్కడే అవకాశం కలిసొచ్చింది. రీచ్‌ల నుంచి డిపోలకు ఇసుకను తరలించే సమయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు.


ఇసుక కావాలంటే ప్రజలు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సిందే. కానీ ప్రభుత్వ పనులకు బల్క్‌ రిజిస్ర్టేషన్‌ ద్వారా, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ వర్కులకు నేరుగా రీచ్‌ల నుంచే ఇసుక ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఇసుక మాఫియా చెలరేగిపోయింది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనుల పేరిట ఇసుక పక్కదారి పడుతోంది. నదిచాగి నుంచి కర్నూలుకు ఇసుక తరలిస్తూ మార్గమధ్యంలో బిల్డర్లకు అమ్మేస్తున్నారు. ఇందులో కొందరు నాయకుల జోక్యం కూడా ఉంది. సాధారణ వ్యక్తులు ఆన్‌లైన్‌లో ప్రయత్నిస్తే.. కొన్ని డిపోలో ఇసుక నో స్టాక్‌ అని ఉంటుంది. వాస్తవానికి ఆ డిపోలో ఇసుక ఉంటుంది. రంగాపురం రీచ్‌ నుంచి కొందరు ఇసుకను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


ఇటీవల దాడులు

ఈ నెల 21న తెలంగాణ నుంచి కర్నూలుకు అక్రమంగా మద్యం తరలిస్తున్న ఐదుగురిని తాలుకా సీఐ ఓబులేసు అరెస్టు చేశారు. మూడు మోటార్‌ సైకిళ్లు, 96 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 


అవుకు పరిధిలో కొండమనాయిని పల్లెలో వెయ్యి లీటర్ల నాటుసారా, 2 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.


సున్నిపెంట సమీపంలో పది లీటర్ల నాటుసారా, 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఆదోని పరిధిలో 4,200 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 


గూడూరు మండలం సుంకేసుల చెక్‌పోస్టు వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా సరఫరా చేస్తున్న 7  మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.


ఆలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అరికెర గ్రామంలో 20 లీటర్ల నాటుసారా, 150 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.


మే 22న అవుకు పీఎస్‌ పరిధిలో గడ్డమేకలపల్లిలో 15 వేల లీటర్ల నాటుసారా ఊట ధ్వంసం చేశారు. 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.


పెద్ద తుంబలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 5 వేల లీటర్ల నాటుసారా సీజ్‌ చేశారు. 


రేవనూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 20 వేల లీటర్ల సారా, బైక్‌ సీజ్‌ చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు.


మహానంది పీఎస్‌ పరిధిలోని గాజులపల్లెలో 800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి, నలుగురిని అరెస్టు చేశారు. 


మే 23న పత్తికొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 20 బిందెల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 


ఆళ్లగడ్డ, హోళగుంద, శిరివెల్ల, అవుకు పీఎస్‌ల పరిధిలో బెల్లం ఊటను ధ్వంసం చేసి, పెద్దఎత్తున సారాను స్వాధీనం చేసుకున్నారు.


ఆత్మకూరు డీఎస్పీ పర్యవేక్షణలో నందికొట్కూరు, మిడ్తూరు పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి 150 తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 6 బైకులను సీజ్‌ చేసి 13 మందిని అరెస్టు చేశారు. కోళ్లబావాపురం ప్రాంతంలో 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.


24న పత్తికొండ, దేవనకొండ, తుగ్గలి పోలీస్‌స్టేషన్ల పరిధిలో జేవరుముల తండాలో పోలీసులు దాడులు చేసి 200 బిందెల నాటుసారా ఊటను ధ్వసం చేసి, 40 లీటర్ల నాటుసారాను సీజ్‌ చేశారు.


హోళగుంద పీఎస్‌ పరిధిలోని కొత్తపేట, నెరణికి తండాల్లో దాడులు చేసి 1050 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.


జొన్నగిరి పీఎస్‌ పరిధిలో 300 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. 


శిరివెళ్ల పీఎస్‌ పరిధిలో చిత్రేనిపల్లి సమీప ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై దాడులు చేసి 1200 లీటర్ల నాటుసారా ధ్వసం చేశారు. 


ఆదోని పీఎస్‌ పరిధిలో అలసందగుట్ట కొండల్లో దాడులు చేసి 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 


కర్నూలు తాలుకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పంచలింగాల టోల్‌ ప్లాజా వద్ద తెలంగాణ నుంచి  కర్నూలుకు తీసుకువస్తున్న 272 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 19 మందిని అరెస్టు చేసి, ఒక కారు, 8 బైకులను సీజ్‌ చేశారు.


25న పత్తికొండ పీఎస్‌ పరిధిలో పెండ్లిమాన్‌ తండాలో దాడులు చేసి 1200 లీటర్ల నాటుసారా, 60 లీటర్ల ఊటను ధ్వంసం చేశారు. 


ఈ నెల 26న రాత్రి పూలబొకేల మాటున ఓ వాహనంలో అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఎస్‌ఈబీ, అడిషినల్‌ ఎస్పీ గౌతమి సాలి ఆధ్వర్యంలో స్పెషల్‌ టీం దాడులు చేసింది. 1001 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. రోజూ ఉదయం హైదరాబాదుకు పూలు తీసుకుని వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మద్యం తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 


వారం రోజుల్లో ఎస్‌ఈబీ చర్యలు

782 మంది అరెస్టు

176 వాహనాలు సీజ్‌

9 వేల మద్యం బాటిళ్లు స్వాధీనం 

4160 లీటర్ల నాటుసారా స్వాధీనం

79640 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

481 టన్నుల ఇసుక స్వాధీనం 


దాడులు మరింత ఉధృతం..గౌతమిశాలి, అడిషినల్‌ ఎస్పీ, ఎస్‌ఈబీ

ఇసుక అక్రమ రవాణా, మద్యం తరలింపు, నాటుసారాను పూర్తిగా అరికట్టడమే ఎస్‌ఈబీ ధ్యేయం. ఇందుకోసం దాడులను మరింత ఉధృతం చేస్తాం. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల నుంచి జిల్లాలోకి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు తెలిసింది. మొబైల్‌ పార్టీలు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా నాటుసారా స్థావరాలపై దాడులు చేస్తున్నాం. నాటుసారా తయారీకి అడ్డుకట్ట వేస్తాం. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాం. పక్కదారి పట్టిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ఇసుక, మద్యం అక్రమాలపై ప్రజలు 7993822444 నెంబరుకు సమాచారం ఇవ్వవచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.  

 

Updated Date - 2020-05-29T10:32:34+05:30 IST