దేవదాయ శాఖ భూమిలో అక్రమ తవ్వకాలు
ABN , First Publish Date - 2020-05-17T09:53:54+05:30 IST
మండలంలోని కొండజూటూరులో దేవదాయ శాఖకు చెందిన వ్యవసాయ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడంతో

అడ్డుకున్న గ్రామస్థులు
పాణ్యం, మే 16: మండలంలోని కొండజూటూరులో దేవదాయ శాఖకు చెందిన వ్యవసాయ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ అర్చకుడు తనకు అర్చకత్వానికి ఇచ్చిన భూమిలో మట్టిని తవ్వి అమ్ముకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్చకత్వానికి తనకు ఇచ్చిన భూమిలో చదును నిమిత్తం మట్టి తరలిస్తున్నట్లు అర్చకుడు రామయ్య శర్మ తెలిపారు. మట్టిని తరలించే దశలో ట్రాక్టర్లు గ్రామంలో విచ్చలవిడిగా వెళ్తూ మట్టిని పారబోస్తుండడంతో గ్రామంలో దుమ్ము పెరిగి ఇబ్బందిగా మారిందని గ్రామస్థులు ఆరోపించారు.
మట్టి తవ్వకాలకు అనుమతి లేదు- వేణునాథరెడ్డి, ఈవో, దేవదాయ శాఖ, పాణ్యం
అర్చకులకు ఇచ్చిన భూముల్లో దేవదాయశాఖ అనుమతి లేకుండా ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదు. తవ్వకాలు చేపట్టిన అర్చకుడిని మందలించాం. తవ్విన మట్టిని గ్రామ ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధికి వినియోగించాలి. మట్టి పంటపొలాల రస్తాలకు, పొలం గట్లకు వినియోగించాలి. మట్టి అమ్మకాలు చేపడితే చర్యలు తీసుకుంటాం.