-
-
Home » Andhra Pradesh » Kurnool » how we will live
-
ఉపాధి పోతే ఎలా బతకాలి..?
ABN , First Publish Date - 2020-12-07T05:29:12+05:30 IST
ఆర్‌ఏఆర్‌ఎస్ భూములను వైద్య కళాశాలకు ఇవ్వవద్దని కోరుతూ కార్మికులు నోట్లో గడ్డి పెట్టుకుని నిరసన తెలిపారు.

- ఆర్‌ఏఆర్‌ఎస్ కార్మికుల ఆవేదన
- నోట్లో గడ్డి పెట్టుకుని నిరసన
నంద్యాల, డిసెంబరు 6: ఆర్‌ఏఆర్‌ఎస్ భూములను వైద్య కళాశాలకు ఇవ్వవద్దని కోరుతూ కార్మికులు నోట్లో గడ్డి పెట్టుకుని నిరసన తెలిపారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని నిర్వీర్యం చేస్తే తామంతా ఉపాధి కోల్పోతామని, గడ్డి తిని బతకాల్సిన దుస్థితి దాపురిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయు ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు ఏవీ రమణ, గోపాల్, రమణయ్య, షకీనాబీ తదితరులు ప్రసంగించారు. దేశంలో ఎంతో ప్రాధాన్యం, చరిత్ర ఉన్న ఆర్‌ఏఆర్‌ఎస్‌పై ఆధారపడి 400 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని అన్నారు. పరిశోధనా స్థానాన్ని నిర్వీర్యం చేస్తే కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఆర్‌ఏఆర్‌ఎస్‌ను కాపాడటంలో ముందుంటామని చెప్పి చేతులెత్తేశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గదని ఎంపీ పోచా, ఎమ్మెల్యే శిల్పా రవి ప్రకటనలు ఇవవ్వడం దుర్మార్గమన్నారు. ప్రజాప్రతినిధుల ఆనాలోచిన నిర్ణయం వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ స్థలాల్లో వైద్య కళాశాలను నిర్మించాలని, లేకుంటే అవసరమైన చోట భూమిని కొనుక్కునేందుకు రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ను కాపాడుకోవడానికి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.