ఎవరో చెబితేనే..!

ABN , First Publish Date - 2020-03-30T10:55:03+05:30 IST

కర్నూలు జిల్లాలో ఇంటింటి సర్వే..

ఎవరో చెబితేనే..!

విదేశాల నుంచి ఎందరు వచ్చారో..

అధికారుల వద్ద అసమగ్ర సమాచారం

సర్వే బృందం పనితీరుపై విమర్శలు

స్థానికులు సమాచారం ఇస్తేనే స్పందన

తొలి కరోనా కేసు నమోదైనా.. నిర్లక్ష్యం 

ప్రమాదపుటంచుల్లో జిల్లా వాసులు


కర్నూలు(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో ఇంటింటి సర్వే ప్రహసనంగా మారింది. గడచిన నెల రోజుల్లో వేలాది మంది జిల్లావాసులు విదేశాల నుంచి తిరిగి వచ్చారు. పక్కా సమాచారం సేకరించలేని సర్వే బృందాలు కాకి లెక్కలతో జిల్లా యంత్రాంగం కళ్లకు గంతలు కడుతున్నాయి. అంతా బాగుందన్న భ్రమల్లో నుంచి అధికార యంత్రాంగం బయట పడటం లేదు. కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అవ్వగానే, 893 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చారని కలెక్టర్‌ ప్రకటించారు. రికార్డుల్లోకి ఎక్కిన వివరాలే తెలిపారు. మిగిలినవారి సమచారం ఆయన వద్ద లేదు.


కర్నూలు నగరానికి వచ్చినవారే 407 మంది ఉండగా, జిల్లా వ్యాప్తంగా  కేవలం 893 మంది ఉన్నారనడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకూ 30 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని డీఎంహెచ్‌వో ప్రకటించారు. సర్వే ద్వారా గుర్తించినవి తక్కువేనని సమచారం. అనుమానిత కేసుల్లో ఎక్కువ శాతం స్థానికుల ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చినవే. వేలాది మందితో కూడిన సర్వే బృందాలు, రూ.కోట్ల విలువైన పరికరాలు అందుబాటులో ఉన్నా కనీసం ఇంటింటి సర్వేను కూడా సమర్థవంతంగా చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే ఎంత మంది వైరస్‌ సోకినవారు జనంలో తిరుగుతున్నారోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


సంజామల మండలంలోని ఓ గ్రామానికి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఈ నెల 19 నుంచి తీవ్రజ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. అనుమానం వచ్చిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. హోం క్వారంటైన్లో భద్రంగా ఉన్న బాధితుడి పరిస్థితి 24వ తేదీ నాటికి విషమించింది. కట్‌ చేస్తే.. 28వ తేదీన జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసుగా నిర్ధారణ అయింది. అధికారులు  గుర్తించకపోవడంతో ఆరు రోజుల పాటు జనావాసాల మధ్య ఆ వ్యక్తి ఉండిపోయాడు. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 


కర్నూలులోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి అమెరికా నుంచి ఇటీవల ఇద్దరు వ్యక్తులు వచ్చారు. స్థానికులు ఫిర్యాదు చేస్తేగానీ ఆ విషయం అధికారులకు తెలియలేదు. సర్వే సిబ్బంది వెళితే తమ ఇంట్లో అలాంటి వారే లేరని యజమానులు బుకాయించారు. ఏమీ చేయలేని సిబ్బంది హోం క్వారంటైన్లో ఉండమని సలహా ఇచ్చి వచ్చేశారు.


స్థానికులు చెబితేనే..

నందికొట్కూరుకు చెందిన ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని రెండు రోజుల క్రితం అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. ఆ ఇద్దరిని ఆర్‌యూ లోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. 


కర్నూలుకు చెందిన ఓ మహిళ దుబాయ్‌లో పనిచేస్తోంది. ఆమె భర్త ఇటీవల దుబాయ్‌ వెళ్లి పిలుచుకు వచ్చాడు. అప్పటి నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అధికారులు జనరల్‌ ఆసుపత్రి ఐసొలేషన్‌ వార్డులో పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు నెగిటివ్‌ అని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


తెలంగాణకు వసల వెళ్లిన కూలీలు సుమారు 84 మంది ఇటీవల తిరిగొచ్చారు. వారికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించలేదు. నిర్లక్ష్యం వహించిన వైద్య శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిని కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. 


పుల్లూరు చెక్‌పోస్టు నుంచి జిల్లాలోకి 150 మంది వలస కూలీలు వచ్చారు. వారికి ప్రాథమిక పరీక్షలు కూడా నిర్వహించకుండా తెలంగాణ పోలీసులు  జిల్లాలోకి అనుమతించారు. అంతకు మునుపు కూడా ఇదే చెక్‌పోస్టు నుంచి తుగ్గలి, ఎమ్మిగనూరు ప్రాంతాలకు చెందిన కూలీలు జిల్లాలోకి ప్రవేశించారు. కనీస సమాచారం అధికారుల వద్ద లేదు. 


ఆత్మకూరుకు చెందిన ఓ డ్రైవర్‌ బంగ్లాదేశ్‌కు వెళ్లి వచ్చాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని స్థానికులు సమాచారం ఇచ్చారు. అధికా రులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నెగిటివ్‌ వచ్చాక వెనక్కి పంపారు. 


స్థానికులే ఆధారం

కర్నూలుకు చెందిన ఓ ఉద్యోగి కుమారుడు విదేశాల నుంచి వచ్చాడు. ఓ జిల్లా అధికారిని కలిసి పరిచయం చేసుకున్నాడు. కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని కర్నూలుకు వచ్చాడు. జలుబు, దగ్గు, జ్వరం రావడంతో స్పందించిన తండ్రి వైద్యులకు సమాచారం ఇచ్చాడు. పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వ్యాపించకుండా పౌరులు చూపిస్తున్న చొరవ బాగానే ఉన్నా, కొందరు సిబ్బంది తీరు విమర్శలకు తావిస్తోంది. విదేశాల నుంచి నగరానికి వచ్చిన వ్యక్తుల జాబితాను కార్పొరేషన్‌ సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గణాంకాల సేకరణలో నిజానిజాలు తేలాల్సి ఉంది. సర్వే సిబ్బంది పనితీరు ఆందోళన కలిగిస్తోంది. 


ఏడుగురు అనుమానితులు: డాక్టర్‌ రామగిడ్డయ్య, డీఎంహెచ్‌వో 

జిల్లాలో కరోనా అనుమానిత కేసులు 30 నమోదయ్యాయి. ఇందులో 22 నెగిటివ్‌ అని తేలింది. ఒకటి పాజిటివ్‌ ఉంది. ఏడుగురి రిపోర్టులు రావాల్సి ఉంది. అనుమానిత కేసుల్లో విదేశాల నుంచి వచ్చినవే ఎక్కువ. వీటన్నింటినీ వైద్య ఆరోగ్య శాఖ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డుకు రెఫర్‌ చేసింది. రెండు రోజుగా విదేశాల నుంచి వచ్చినవారిపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నాం. 


Updated Date - 2020-03-30T10:55:03+05:30 IST