1.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు

ABN , First Publish Date - 2020-12-26T05:17:44+05:30 IST

జిల్లాలో 1.6 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వెల్లడించారు.

1.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన

  ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 


డోన్‌, డిసెంబరు 25: జిల్లాలో 1.6 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం డోన్‌ బాలికల ఉన్నత పాఠశాలలో వైఎస్సార్‌ జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకాన్ని మంత్రితో పాటు జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ టిడ్కో ద్వారా రాష్ట్రంలో 2.7లక్షల అపార్టుమెంట్లు నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. 40 ఏళ్ల పాటు డోన్‌ నియోజకవర్గాన్ని పాలించిన కేఈ, కోట్ల కుటుంబాలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత ఐదేళ్లలో పేదలకు ఒక్క ఇంటి పట్టా అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో డోన్‌లో 4 వేల మంది మహిళలకు ఇంటి పట్టాలు ఇచ్చి రూ.7లక్షల ఆస్తిని చేతుల్లో పెట్టామని, అన్ని వసతులతో సొంతిల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. దొరపల్లి కొండ వద్ద, ఉడుములపాడు వద్ద కాలనీలకు మంత్రి భూమిపూజ చేశారు.


ప్రతి హామీని నెరవేరుస్తున్నాం

 ఆలూరు, డిసెంబరు 25: ప్రతి హామీని నెరవేరుస్తున్నామని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శుక్రవారం ఆలూరులో నవరత్నాలు.. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల స్థలాలను మంత్రి జయరాం, కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎంపీ సంజీవ్‌కుమార్‌ పంపిణీ చేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ఏ ప్రభుత్వమూ ఇలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదన్నారు. ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా పాలన అందిస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ వీరపాండియన్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ పథకం ద్వారా రూ.882 కోట్లతో భూములు కొనుగోలు చేసి 98,308 మంది లబ్ధిదా రులకు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం రూ.1777 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, రెండో విడతలో మరో 60 వేల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. రూ.1800 కోట్లు టిడ్కో ఇళ్లకు ఖర్చు పెట్టామన్నారు. 2,19,735 మందికి ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టామన్నారు.
 నిలదీతలు.. నిరసనలు


కర్నూలు(న్యూసిటీ/కోడుమూరు రూరల్‌), డిసెంబరు 25: ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా పలు చోట్ల ప్రజాప్రతినిధులకు నిరసనలు ఎదురయ్యాయి. తమకు అన్యాయం జరిగిందంటూ స్థానికులు నిలదీశారు. 


  కర్నూలు మండలం రుద్రవరం గ్రామంలో గందరగోళం నెలకొంది. తమ గ్రామంలోని వారికి కాకుండా ఇతరులకు ఎలా ఇస్తారంటూ కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌ను నిలదీశారు. తమ గ్రామ పరిధిలోని 350 ఎకరాల్లో ఇళ్లపట్టాలను ఇస్తున్నప్పుడు.. బియ్యం కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నగరంలో నివసించే వారికి తమ గ్రామంలో ఎలా ఇస్తారని ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. ప్రభుత్వం కేవలం వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తోందని ఆరోపించారు. త్వరలోనే న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు. 


  అనువుగాని చోట ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై కోడు మూరు మండలం వెంకటగిరి గ్రామస్థులు ఎమ్మెల్యే సుధాకర్‌ వద్ద అసం తృప్తి వ్యక్తం చేశారు. కొండ ఎగువన పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి కొండను చదును చేసి 1044 పట్టాలను సిద్ధం చేసింది. ఇక్కడ గ్రామ లబ్ధిదారులతో పాటు ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న వర్కూరు, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడుమూరు లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే సుధాకర్‌ వచ్చి ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన తర్వాత మాట్లాడారు. పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తిరిగి వెళ్తుండగా.. వెంకటగిరి మహిళలు వచ్చి పట్టాలు దిగువన ఇస్తే తీసుకునే ప్రసక్తేలేదన్నారు. దీంతో ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతానని చెప్పి వెళ్లిపోయారు. కార్యక్రమం లో నియోజకవర్గ ప్రత్యేకాధికారి మల్లిఖార్జున, డీఆర్‌డీఏ శ్రీనివాసులు, తహసీల్దార్‌ ఉమామహేశ్వరమ్మ, ఎంపీడీవో మంజులవాణి, ఎస్‌ఐ మల్లికార్జున పాల్గొన్నారు.

Updated Date - 2020-12-26T05:17:44+05:30 IST