అర్చకులపై దాడి అమానుషం

ABN , First Publish Date - 2020-12-01T06:14:09+05:30 IST

బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో అర్చకులపై దాడి చేసిన ఆలయ చైర్మన్‌ ప్రతాపరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య, అన్యాక్రాంత ఆస్తుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు సండేల్‌ చంద్రశేఖర్‌ సోమవారం ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

అర్చకులపై దాడి అమానుషం
నిరసన తెలుపుతున్న అర్చకులు

  1. ప్రతాపరెడ్డిపై చర్యలు తీసుకోవాలి
  2. ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య


కర్నూలు (కల్చరల్‌), నవంబరు 30: బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో అర్చకులపై దాడి చేసిన ఆలయ చైర్మన్‌ ప్రతాపరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య, అన్యాక్రాంత ఆస్తుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు సండేల్‌ చంద్రశేఖర్‌ సోమవారం ప్రకటనలో డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి విచారణ జరిపించాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోయి బ్రాహ్మణులకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. నిరుపేద బ్రాహ్మణ అర్చకులపై భౌతిక దాడిని రాష్ట్రంలోని 13 జిల్లాల బ్రాహ్మణులు ఖండిస్తున్నారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ తో  అర్చకులు ఎనిమిది మాసాలుగా ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటించారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణులను గర్భాలయం ముందే విచాక్షణారహితంగా కొట్టడం బాధాకరమని పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునే వారికి గతంలో ఎప్పుడూ లేని విధంగా టికెట్‌ కౌంటర్లను ఆలయ కమిటీ ఛైర్మన్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. తెలిసినవారిని పూజారులు ఉచితంగా దర్శనానికి పంచించారని,  భక్తుల ముందే పశువులను కొట్టే చెర్నాకోలతో చితకబాదడం అన్యాయమన్నారు. అధికార బలంతో విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్న ఛైర్మన్‌ను తక్షణం పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్‌ చేశారు.  


ప్రతాపరెడ్డిని అరెస్ట్‌ చేయలి

  1.  బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ  

ఆదోని(అగ్రికల్చర్‌), నవంబరు 30: ఓంకార క్షేత్రం చైర్మన్‌ ప్రతాపరెడ్డి ధన దాహానికి సహకరించలేదనే కోపంతో అర్చకులపైన దాడి చేయడం చాలా విచారకరమని, ఆయన్ను అరెస్టు చేయాలని అర్చక పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఓంకార క్షేత్రంలో భక్తులు ఎప్పుడు వెళ్లినా ఉచిత దర్శనం చేసుకునే  సంప్రదాయం ఉందని అన్నారు. అయితే  ప్రతాపరెడ్డి చైర్మన్‌ అయ్యాక  దేవస్థానంలో అక్రమ సంపాదనలకు అలవాటు పడ్డారని, అందులో భాగంగానే టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి అడ్డుపడుతున్న అర్చకులపై కోపం పెంచుకొని  పూజారులపైన ప్రతాపరెడ్డి  దాడి చేయించాడని ఆరోపించారు.  అర్చకులు ముగ్గురిని   చితకకొట్టడం చాలా దారుణమన్నారు.  ఒక అర్చకుడి ఆరోగ్య పరిస్థితి విషమించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అన్నారు. ఆలయ చైర్మన్‌ ప్రతాపరెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని  కోరారు. 

Updated Date - 2020-12-01T06:14:09+05:30 IST