కట్టడం సాధ్యమేనా?

ABN , First Publish Date - 2020-12-25T06:09:03+05:30 IST

పక్కా ఇళ్లపై పేదలకు వైసీపీ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది.

కట్టడం సాధ్యమేనా?
రుద్రవరం మండలం హరినగరం సమీపంలో ఇళ్ల స్థలాల్లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు

  1.   పేదల ఇంటికి రూ.1.80 లక్షలు
  2.   రాయితీని తగ్గించిన ప్రభుత్వం
  3.   పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు
  4.  జిల్లాకు 1,30,303 ఇళ్ల కేటాయింపు  
  5.   నేడు ఇంటి పట్టాల పంపిణీ
  6.  గృహాల నిర్మాణానికి శ్రీకారం


కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 24: పక్కా ఇళ్లపై పేదలకు వైసీపీ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఒక్కొక్క ఇంటికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న వైసీపీ, ఇప్పుడు వెనుకడుగు వేసింది. ఒక్కొక్క ఇంటికి ఇచ్చే రాయితీ కేవలం రూ.1.80 లక్షలు మాత్రమేనని తేల్చేసింది. లబ్ధిదారులకు అదనంగా ఇవ్వకపోగా.. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీని తగ్గించింది. గత ప్రభుత్వం పట్టణ, మున్సిపాలిటీల్లో నిర్మించుకున్న ఇళ్లకు రూ.2.50 లక్షలు రాయితీ ఇచ్చింది. పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో కట్టుకున్న ఇళ్లకు రూ.2 లక్షలు ఇచ్చింది. అంతకుమించి లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్‌, అధికారం చేపట్టిన తర్వాత మొత్తానికే కోత పెట్టారు. యూడీఏలలో కట్టుకున్న ఇళ్లకు మాత్రం ఇంటికి రూ.30 వేలు రాష్ట్రం వాటా కాగా, మిగతా మొత్తం రూ.1.50 లక్ష కేంద్రం నిధులే.. ఇందులో ఉపాధి హామీ నిధులను కేటాయించారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని  అంటుతున్నాయి. ఈ నిధులతో ఇళ్లు పూర్తవుతాయా అన్న అనుమానం లబ్ధిదా రుల్లో  నెలకొంది. శివారు ప్రాంతాల్లో, నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తుండ టంతో పేదలు అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. ఇంటి స్థలాలు ఎంపిక చేసిన ప్రాం తాలకు రోడ్డు, రవాణా సౌకర్యాలు లేవు. కూలీ నాలి చేసుకునే జీవ నం చేసే పేదలు ఆ ప్రాంతాల్లో నివాసం ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


1,30,303 ఇళ్ల మంజూరు

జిల్లా గృహ నిర్మాణ సంస్థ ద్వారా రెండేళ్లలో 1,30,303 మంజూరైన ఇళ్లను పూర్తి చేయాల్సి ఉంది. మొదటి విడతలో 98,388 ఇళ్లు కాగా, వచ్చే ఏడాది 31,188 ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ఈ ఇంటి పనుల కోసం ప్రభుత్వం రూ.2,345 కోట్లు ఖర్చు చేయ నుంది. ఒక్కొక్క ఇంటికి రూ.1.8 లక్షలు కేటాయించింది. జిల్లాలో 970 లే అవుట్లలో (కాలనీలు) ఇంటి నిర్మాణం పను లు చేపట్టనున్నారు. నీటి సరఫరా కోసం రూ.8681.53 లక్షలు, విద్యుత్‌ సౌకర్యం కోసం 11,497.35 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. 


నియోజకవర్గాల వారీగా..

ఆదోని డివిజన్‌కు మొత్తం 49,123 ఇళ్లు కేటాయించింది. ఇందులో ఆదోని నియోజకవర్గానికి 8757, ఆలూరుకు 9751 ఇళ్లు, మంత్రాలయానికి 10,644, పత్తికొండకు 10,451, ఎమ్మిగనూరుకు 9520 ఇళ్లు కేటాయించింది. కర్నూలు డివిజన్‌కు 37,120 ఇళ్లు కేటాయించారు. ఇందులో డోన్‌ నియోజకవర్గానికి 11,391 ఇళ్లు, కోడుమూరుకు 8,801, కర్నూలు అర్బన్‌కు 7529, నందికొట్కూరుకు 4339, పాణ్యంకు 5060 ఇళ్లు మంజూరు చేసింది. నంద్యాల డివిజన్‌కు 12,145 ఇళ్లను కేటాయించారు. ఇందులో ఆళ్లగడ్డకు 1531 ఇళ్లు, నంద్యాలకు 9,006 ఇళ్లు, శ్రీశైలానికి 1608 ఇళ్లను కేటాయించారు. 7 కిలోమీటర్ల దూరంలో ఇంటిస్థలాలు


రుద్రవరం, డిసెంబరు 24: ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమాన్ని పండుగలా చేస్తామని అధికార పార్టీ నాయకులు ప్రకటించారు. అధికారులు కూడా ఆ మేరకు బిజీగా కనిపిస్తున్నారు. కానీ.. కేటాయించే స్థలాలు ఊరికి దూరంగా, చిట్టడివిని తలపించే ముళ్లపొదల్లో ఉన్నాయని లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఫ రుద్రవరం మండలం నరసాపురం, చిత్రేణిపల్లె గ్రామాల పేదలకు హరిహరనగరం సమీపంలోని నవ అహోబిలం ప్రాంతంలో స్థలాలు కేటాయించారు. ఈ స్థలాలను ఇన్‌చార్జి ఎంపీడీవో వరలక్ష్మి, పీఆర్‌ ఏఈ వెంకట్రాముడు, ఏపీవో ప్రతాప్‌ గురువారం పరిశీలించారు. అక్కడ పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. అక్కడికి వెళ్లేందుకు రహదారి కూడా లేదు. కల్వర్టు నిర్మించేందుకు అధికారులు కొలతలు వేశారు. 

ఫ హరిహర నగరం సమీపంలో ఆలమూరు రెవెన్యూ పరిధిలో 1235 సర్వే నెంబర్‌లో 56 మందికి స్థలాలు కేటాయిం చారు. లే ఔట్‌కు నరసాపురం గ్రామం 7 కి.మీ. దూరంలో ఉంటుంది. అక్కడ 56 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. చిత్రేణిపల్లె లబ్ధిదారులకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో లే ఔట్‌ ఉంది. అక్కడ 62 మందికి స్థలాలు కేటాయించారు. అంత దూరంలో ఉండటం ఎలా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. 

సబ్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు..

సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి ఆదేశాల మేరకు హరినగరం లేఔట్‌ వద్ద కల్వర్టు నిర్మాణానికి కొలతలు వేయించాం. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. అధికా రుల అనుమతి వచ్చిన వెంటనే కల్వర్టు నిర్మించి రహదారి ఏర్పాటు చేస్తాం. 

- వరలక్ష్మి, ఇన్‌చార్జి ఎంపీడీవో, రుద్రవరం 

గ్రామానికి దూరం..

గ్రామానికి లేఔట్‌ దూరంగానే ఉంది. గ్రామ సమీపంలో స్థలాలు లేక పోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేశాం. నరసాపురం గ్రామానికి చెందిన 56 మందికి ఇక్కడే ఇళ్ల స్థలాలు సిద్ధం చేశాం. 

- రామకృష్ణ, వీఆర్వో, నరసాపురం

Updated Date - 2020-12-25T06:09:03+05:30 IST