జగన్ నిర్ణయంతో అభివృద్ధి సంక్షోభం: గౌరు చరిత
ABN , First Publish Date - 2020-08-12T18:15:11+05:30 IST
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సీఎం జగన్ నిర్ణయంతో..

కర్నూలు(ఆంధ్రప్రదేశ్): రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సీఎం జగన్ నిర్ణయంతో అభివృద్ధి సంక్షోభంలో పడుతుందని తెలుగుదేశం పార్టీ పాణ్యం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం తగదని అన్నారు. జిల్లాలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు జరగడంతో పారిశ్రామిక ప్రగతిని పరుగులు తీసిందని అన్నారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సోలార్ పవర్ ప్రాజెక్టును అప్పటి సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసి రాష్ట్రానికి వెలుగులు పంచారని అన్నారు.
ఓర్వకల్లులో 900 ఎకరాల్లో రూ.110 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 18 నెలల్లోనే ఎయిర్‌పోర్టును నిర్మించారని అన్నారు. పాణ్యం మండలంలో ఓర్వకల్లు రిజర్వాయరును రూ.840 కోట్లు ఖర్చు చేసి 1.90 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందేలా ప్రణాళిక రూపొందించారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి విధానాల వల్ల ఈ అభివృద్ధి అంతా సంక్షోభంలో పడిపోతుందని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీల నేతల సలహాలతో జగన్ పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.