ఐదు ఇళ్లలో చోరీ

ABN , First Publish Date - 2020-11-22T05:27:24+05:30 IST

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. మొత్తం 15 తులాల బంగారం, రూ.94వేలు నగదును ఎత్తుకెళ్లారు.

ఐదు ఇళ్లలో చోరీ
నంద్యాలలో చెల్లాచెదురుగా పడి ఉన్న బీరువాలోని వస్తువులు

  1.  అవుకులో నాలుగు ఇళ్లలో చోరీ
  2.  రూ.64 వేల నగదు, 5 తులాల బంగారం అపహరణ
  3.  నంద్యాలలో ఓ ఇంట్లో 10 తులాల బంగారు, రూ.30 వేలు

నంద్యాల (నూనెపల్లె), నవంబరు 21: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. మొత్తం 15 తులాల బంగారం, రూ.94వేలు నగదును ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌బీఐ కాలనీకి చెందిన రామచంద్రుడు గడివేములలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో క్లర్క్‌గా పని చేస్తున్నారు. సమీప బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు మూడు రోజుల క్రితం ఉయ్యాలవాడ మండలం పెద్దఉమ్మనూరుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. శనివారం నంద్యాలకు తిరిగి వచ్చారు. ఇంటి ముఖ ద్వారానికి ఉన్న తాళాలు పగిలి కిందపడి ఉండడాన్ని గమనించారు. ఇంట్లో బీరువా తలుపులు తెరుచుకొని ఉన్నాయి. దీంతో వెంటనే టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించారు. బీరువాలో ఉన్న 10 తులాల బంగారు నగలు, రూ.30 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు రామచంద్రుడు తెలిపారు. ఈ మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


అవుకు: అవుకు పట్టణం కొత్తకాల్వ వీధి సమీపంలోని నాలుగు ఇళ్లల్లో శనివారం తెల్లవారుఝూమున చోరీలు జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్వరి అనే మహిళ ఇంట్లో 3తులాలు బంగారం, రూ.31,500 నగదు, సుబ్రహ్మణ్యం ఇంట్లో 2తులాల బంగారం, రూ. 21,500 నగదు, సుబ్బరాయుడు ఇంట్లో రూ.5వేలు నగదు, బాల వీరమ్మ ఇంట్లో రూ. 6వేలు నగదు ఎత్తుకెళ్లారు. పెళ్లిళ్లు, ఆసుపత్రులకు వెళ్లటంతో ఇళ్లకు తాళాలు వేసిఉండటం గమనించిన దుండగులు తాళాలు పగులగొట్టి చోరీ చేశారు. చోరీలు జరిగిన ఇళ్లను డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసుల దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

Read more