పంటల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-11-22T05:28:00+05:30 IST

జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న వివిధ రకాల పంటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు.

పంటల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
మాట్లాడుతున్న ఏడీఆర్‌ మురళీకృష్ణ

  1. రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన
  2. ప్రస్తుత వ్యవసాయ స్థితిగతులపై సమీక్ష


నంద్యాల, నవంబరు 21: జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న వివిధ రకాల పంటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం ఏడీఆర్‌ మురళీకృష్ణ అధ్యక్షతన శిక్షణ, సందర్శన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ బోసుబాబు, రైతు శిక్షణా కేంద్రం నంద్యాల డిప్యూటీ డైరెక్టర్‌ విల్సన్‌, కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి పోగ్రాం కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లె పోగ్రాం కోఆర్డినేటర్‌ ధనలక్ష్మి, డాట్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ సుజాతమ్మ, ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త వై.రామారెడ్డి, శాస్త్రవేత్తలు, జిల్లాలోని వివిధ వ్యవసాయ డివిజన్ల ఏడీలు ప్రస్తుత వ్యవసాయ స్థితిగతులపై సమీక్షించారు.

 

ప్రస్తుతం రబీ పంటల విస్తీర్ణంలో 51 శాతం పూర్తయినట్లు నిర్ధారించారు. శనగ సాధారణ విస్తీర్ణంలో 65 శాతం, జొన్న 42 శాతం, మినుము 69.1 శాతం సాగు అయినట్లు నిర్ధారించారు. ఖరీఫ్‌లో పత్తి సాగు పెరిగినట్లు గుర్తించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా, సెప్టెంబరు - అక్బోబరు నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తేలికపాటి నేలల్లో దిగుబడులు ఆశాజనకంగా వచ్చే అవకాశం ఉందని నిర్ధారించారు. ప్రస్తుతం రెండో దశ పత్తి తీత జరుగుతున్నట్లు తెలిపారు.


రబీలో శనగ సాగు విస్తీర్ణం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా, వర్షాధారంగా జొన్న, మినుము, అజ్వాన్‌, ఆరుతడి పంటలుగా మిరప, ఉల్లి విస్తీర్ణం పెరిగినట్లు తెలిపారు. ఖరీఫ్‌లో పత్తి అధిక విస్తీర్ణం కారణంగా శనగ విస్తీర్ణం తగ్గినట్లు తెలిపారు.


అధిక వర్షాల వల్ల వేరుశనగ దిగుబడి తగ్గిందని, పత్తి మేటకు పనికి రాకుండా నల్లబడిందని, కందిలో పూత ఆలస్యమై మారుక మచ్చల పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. 


ఉల్లి, మిరపలో ఎండు, కాయకుళ్లు తెగుళ్లను గమనించినట్లు తెలిపారు. ఖరీఫ్‌ మొక్కజొన్న దిగుబడులు తగ్గాయని గుర్తించారు.


పత్తిలో గులాబీ పురుగు, శనగలో రబ్బరు, శనగపచ్చ పురుగు, ఎండు తెగులు, కందిలో మారుక మచ్చల పురుగు, జొన్నలో కాండం తొలుచు ఈగ, మొక్కజొన్నలో కత్తెరపురుగు, వరిలో మానిపండు తెగులు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు ఆర్‌ఏఆర్‌ఎస్‌ పరిశోధనా పంటలను పరిశీలించి శాస్త్రవేత్తల ద్వారా పలు చర్యలను తెలుసుకున్నారు. 

Updated Date - 2020-11-22T05:28:00+05:30 IST