వైసీపీది దౌర్జన్య పాలన: మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-09-17T18:25:31+05:30 IST

రాష్ట్ర అసెంబ్లీ మొదలు నియోజకవర్గ స్థాయి వరకూ అధికార పార్టీ దౌర్జన్యకాండ కొనసాగుతోందని..

వైసీపీది దౌర్జన్య పాలన: మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి

ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు

అవినీతికి బీజేపీతోనే అడ్డుకట్ట


కర్నూలు: రాష్ట్ర అసెంబ్లీ మొదలు నియోజకవర్గ స్థాయి వరకూ అధికార పార్టీ దౌర్జన్యకాండ కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. బైరెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా, సాంఘికంగా దెబ్బతినిందని, కుల రాజకీయాలు పతాకస్థాయికి చేరాయని   విమర్శించారు. ఒక వైపు కొవిడ్‌, మరోవైపు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్రం అత్యంత ప్రమాదకర స్థితికి చేరిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ సంక్షేమ పథకాల పేరుతో రూ.10 ఇచ్చి, పన్నుల రూపంలో రూ.100 లాగేసుకుంటున్నా రని విమర్శించారు. కరెంటు, ఆర్టీసీ బస్‌ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు.


మద్యం ధరలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉన్నాయని అన్నారు. ఇసుక, మద్యం మాఫియా, భూకబ్జాలు పెరిగిపోయా యని అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది ఈగలు తోలుతున్నారని అన్నారు. వీటిని ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నా రని ఆరోపించారు. కొవిడ్‌ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే.. స్థానిక ఎమ్మెల్యే తనపై కేసులు పెట్టించారని అన్నారు.   మంత్రి స్వగ్రామంలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేస్తే వైసీపీ నాయకులు పోలీసులపైనే తిరగబడ్డారని ఆరోపించారు. శ్రీశైలం, మహానంది, మంత్రాలయంలో అన్యమతస్థుల పెత్తనం అధికమైందని అన్నారు. అంతర్వేది సంఘటనను  చూస్తే రాష్ట్రాన్ని ఏదైనా మత రాష్ట్రంగా ప్రకటించబోతున్నారా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు.


వైసీపీ ఎమ్మెల్యేల మాటలు వింటుంటే జగన్‌ పులివెం దులలో తిట్లదండకం శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారేమోనని అనిపిస్తోందని అన్నారు. జగన్‌ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందనీ, దీనికి అడ్డుకట్ట వేసేది భారతీయ జనతా పార్టీ ఒక్కటేనని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మహిళా నాయకురాలు బైరెడ్డి శబరి, పార్టీ జిల్లా అధ్యక్షులు రామస్వామి, అంబాల ప్రభాకర్‌ రెడ్డి, చింతలపల్లి రామకృష్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-17T18:25:31+05:30 IST