పుష్కర భక్తులకు ఆహారం

ABN , First Publish Date - 2020-11-28T05:03:14+05:30 IST

పుష్కర భక్తులకు ‘తానా’ ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌ ద్వారా ఆహార పొట్లాలను అందజేస్తున్నారు.

పుష్కర భక్తులకు ఆహారం
తానా ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్న దృశ్యం

  1. ఘాట్ల వద్ద తానా ఆధ్వర్యంలో..
  2.  కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌ ద్వారా.. 
  3. పుష్కరాల ముగింపు వరకు కొనసాగింపు


కర్నూలు(కల్చరల్‌), నవంబరు 27: పుష్కర భక్తులకు ‘తానా’ ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌ ద్వారా ఆహార పొట్లాలను అందజేస్తున్నారు. విపత్తుల సమయంలో అన్నార్థుల ఆకలి బాధ తాము తీర్చేందుకు ఉందుకు వచ్చే ‘తానా’, ‘కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌’ సంస్థలు  ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక వేడుకల్లోనూ భక్తులకు తమవంతుగా అన్న ప్రసాదాలు అందిస్తున్నాయి. ‘తానా’, దాని అనుబంధ సంస్థ ‘కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌’ సంస్థలు   తుంగభద్ర పుష్కరాల్లోనూ భక్తులకు ఆహార పొట్లాలను అందిస్తున్నాయి. కర్నూలులోని సంకల్‌బాగ్‌లో నిత్యం ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. నిత్యం వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు భక్తులకు వీటిని అందజేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో హైజోనిక్‌ పద్ధతిలో ప్యాకింగ్‌ చేసిన ఆహారాన్ని అందిస్తున్నారు. ఎన్నారై ఫౌండేషన్‌ గౌరవాధ్యక్షుడు ముప్పా రాజశేఖర్‌, అధ్యక్షుడు   మధుసూదన్‌, ప్రధాన కార్యదర్శి తమ్మినేని మీనాక్షినా యుడు, కోశాధికారి డాక్టర్‌ బాలీశ్వ రరెడ్డి, కార్యదర్శి జంపాల వెంకటేశ్‌ పుష్కరాల ఘాట్‌ వద్ద నిత్యం వీటిని పంపిణీ చేస్తున్నారు. తానా, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌, శ్రీసాయి ఎంటర్‌ప్రైజెస్‌ (పుల్లూరు టోల్‌ప్లాజా) సంస్థల ప్రతినిధులు లాక్‌డౌన్‌ సమయంలో వంద రోజులకు పైగా అన్నదానం చేశారు. ప్రధానంగా తానా కార్యదర్శి రవి పొట్లూరి సహకారంతో, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌ గౌరవాధ్యక్షుడు, బాలాజీ క్యాంటిన్‌ అధినేత ముప్పా రాజశేఖర్‌ ఆధ్వర్యంలో నిత్యం ఐదారు వేల మందికి భోజన పొట్లాలు పంపిణీ చేశారు. 


సామాజిక సేవలో ఎంతో సంతృప్తి

కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో పేదలు, వలస కార్మికులు, కూలీల దయనీయ స్థితిని చలించి నా మిత్రుడు అమెరికాలోని తానా ప్రధాన కార్యదర్శి రవి పొట్లూరికి తెలియజేశాను.  ఆయనతో పాటు మరికొంత మంది మిత్రుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత ఇస్తున్నాం. కొన్ని చోట్ల విద్యార్థులను దత్తత తీసుకొని   చదివిస్తున్నాం. వారి చదువులకు అయ్యే ఖర్చు మేమే భరిస్తున్నాం. 

- ముప్పా రాజశేఖర్‌, గౌరవాధ్యక్షుడు, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌


సేవాగుణం అలవర్చుకోవాలి

ప్రతి ఒక్కరూ తమకు ఉన్నదాంట్లోనే కొంత సాయం చేసేందుకు ముందుకు రావాలి. ప్రధానంగా ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే వారికి కలిగే సంతృప్తి వెలకట్టలేనిది. పది మంది మా సేవా కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి పొంది మరో పది మందికి సహాయ పడితే అంతకన్నా మించింది మరోటి లేదు. రాబోయే రోజుల్లోనూ మా సేవా కార్యక్రమాలను కొన సాగిస్తాం. 

- తమ్మినేని మీనాక్షినాయుడు,  ప్రధాన కార్యదర్శి, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌


Read more