-
-
Home » Andhra Pradesh » Kurnool » First day lockdown
-
తొలిరోజు అమలుగాని లాక్‌డౌన్
ABN , First Publish Date - 2020-03-24T11:07:03+05:30 IST
జనతా కర్ఫ్యూకి భారీ స్పందన వచ్చినా ఆ మరుసటి రోజు సోమవారం జనం లాక్‌డౌన్ నిబంధనలు పాటించలేక పోయారు.

గుంపులు గుంపులు
రోడ్లపై భారీగా వాహనాలు
మధ్యాహ్నానికి పోలీసుల స్పందన
వాహనాల నిలిపివేత.. సీజ్
కర్నూలు, మార్చి 23: జనతా కర్ఫ్యూకి భారీ స్పందన వచ్చినా ఆ మరుసటి రోజు సోమవారం జనం లాక్‌డౌన్ నిబంధనలు పాటించలేక పోయారు. రోడ్లపై రద్దీతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వాహనదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషా, కర్నూలు డీఎస్పీ బాబా ఫకృద్దీన్ నేతృత్వంలో సీఐలు శ్రీనివాసమూర్తి, మహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి నగరంలోని కూడళ్లలో తనిఖీలు చేశారు. అన్ని రకాల ప్రైవేటు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 31 వరకు వాహనాలను బయట తిప్పరాదని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలీసులు రోడ్లపైకి వచ్చారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేశశాఉ. కొత్తబస్టాండు ఈద్గా వద్ద, గౌరి గోపాల్ హాస్పిటల్, గాయత్రీ ఎస్టేట్ సమీపంలో వాహనాలను వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. అయినా పోలీసులు ఎవరినీ వదలకుండా వెనక్కి పంపించేశారు.
రవాణా శాఖ దాడులు
జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు విస్తృతంగా దాడులు చేశారు. డీటీసీ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో ఎంవీఐలు శివలింగయ్య, జయశ్రీ, దీపిక, భూషణ్‌రెడ్డి, రాజగోపాల్ పలు చోట్ల తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 147 ఆటోలు, 6 జీపులను సీజ్ చేశారు. కొన్నింటిని ఆర్టీసీ డిపో, మరి కొన్నింటిని డీటీసీ కార్యాలయానికి తరలించారు. నిబంధనలను ఉల్లంగిస్తే 6 నెలల జైలు శిక్ష రూ.వెయ్యి జరిమానా ఉంటుందని డీటీసీ హెచ్చరించారు.
లాక్‌డౌన్ అంటే..
అంటు వ్యాధుల చట్టం 1897లోని సెక్షన్ 2, 3, 4 ప్రకారం ఏదైనా అంటువ్యాధిని నివారించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తారు. అన్ని వ్యవస్థలను నియంత్రించేందుకు లాక్‌డౌన్ ప్రకటిస్తారు. నిత్యావసరాలైన కిరాణం, పాలు, కూరగాయల దుకాణాలను మాత్రం అనుమతిస్తారు. వీటి రవాణాకూ అనుమతి ఉంటుంది. మందుల దుకాణాలు, ఆసుపత్రులు తెరిచే ఉంటాయి. ఇవి తప్ప మిగిలిన సంస్థలు, వాహనాలను నిషేధిస్తారు. బైక్‌లను కూడా అనుమతించరు. నిబంధనలను ఉల్లంఘించి బయట తిరిగే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. భారీగా జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు.