వరదలతో జాగ్రత్త

ABN , First Publish Date - 2020-07-28T10:59:22+05:30 IST

వరదలపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

వరదలతో జాగ్రత్త

నీటిని వృథా కానివ్వకూడదు

రోడ్లు, కల్వర్టులు మరమ్మతు చేయాలి

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశం

ఇరిగేషన్‌, పీఆర్‌ ఇంజనీర్లతో సమీక్ష


కర్నూలు, జూలై 27(ఆంధ్రజ్యోతి): వరదలపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం మధ్యాహ్నం కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌ గెస్ట్‌ హౌస్‌లో వరద పరిస్థితి, సహాయక చర్యలపై కలెక్టర్‌ జి. వీరపాండియన్‌, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్పీ పక్కీరప్ప, జాయింట్‌ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ వరదలు రాకముందు, వచ్చిన తర్వాతర తీసుకోవాల్సిన చర్యలపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.


గతంలో నగరానికి వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం, సుంకేసుల, గాజులదిన్నె, వెలుగోడు, గోరుకల్లు, పోతిరెడ్డిపాడు, అవుకు రిజర్యాయర్లతో పాటు కృష్ణా, తుంగభద్ర, హంద్రీ నదులకు వచ్చే వదరలను ముందే అంచనా వేసి లోతట్టు ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరద ద్వారా వచ్చే నీటిని వృథా కానివ్వకూడదన్నారు. వరదలతో దెబ్బతిన్న రోడ్లను, కల్వర్టులను మరమ్మతులను చేయడానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కల్లూరు వంక ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారని, వంకపై వెంటనే లోలెవెల్‌ బ్రిడ్జి మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్‌ నిధి మీనా, జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రామచంద్రమూర్తి, హంద్రీ ఎస్‌ఈ చంద్రశేఖర్‌, ఆర్‌ఆండ్‌బీ ఎస్‌ఈ జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-28T10:59:22+05:30 IST