హమాలీలతో రైతుల వాగ్వాదం

ABN , First Publish Date - 2020-11-27T05:33:33+05:30 IST

హమాలీలతో రైతులు వాగ్వాదానికి దిగారు.

హమాలీలతో రైతుల వాగ్వాదం
బారులు తీరిన మొక్కజొన్న ధాన్యం వాహనాలు

  1. మొక్కజొన్న ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేయడం లేదని ఆగ్రహం
  2. ఎస్‌డబ్ల్యూసీ మేనేజర్‌ చొరవతో సమస్య పరిష్కారం 


గడివేముల, నవంబరు 26: హమాలీలతో రైతులు వాగ్వాదానికి దిగారు. మొక్కజొన్న ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్‌లో సాగు చేసిన మొక్కజొన్న పంటను ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించారు. ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులు ధాన్యాన్ని ఎస్‌డబ్ల్యూసీ గోదాములకు తరలించాల్సి ఉన్నా పట్టించుకోలేదని రైతులు మండిపడ్డారు. వర్షానికి ధాన్యం తడుస్తాయన్న ఉద్దేశంతో రైతులు వాహనాలను బాడుగకు తీసుకొని ధాన్యాన్ని గడివేముల సమీపంలోని గోదాముకు తరలించారు. అయితే వర్షం పడుతుందన్న ఉద్దేశంతో హమాలీలు అన్‌లోడ్‌ చేయలేదు. దీంతో రైతులు వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షం అధికమవుతున్నా హమాలీలు స్పందించక పోవడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఎస్‌డబ్ల్యూసీ మేనేజర్‌ నందిని గోదాము నిర్వాహకుడు, హమాలీలతో చర్చించారు. ధాన్యాన్ని ట్రాక్టర్‌ నుంచి అన్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకున్నారు. 


భారీగా ట్రాఫిక్‌ జామ్‌ 

హమాలీలు మొక్కజొన్న ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేయక పోవడంతో గోదాము వద్ద రహదారి వెంట ట్రాక్టర్లు, లారీలు భారీగా నిలిచాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. 


Read more