రైతుల ఉసురుతో పతనం ఖాయం
ABN , First Publish Date - 2020-12-04T05:17:20+05:30 IST
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనం ఖాయమని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు సద్దాం హుసేన్ అన్నారు.

- రైతు సంఘాల నాయకుల ఆగ్రహం
- ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతు
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు, వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల్లో గురువారం ధర్నాలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాల వల్ల రైతులు తీవ్రం నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
నంద్యాల, డిసెంబరు 3: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనం ఖాయమని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు సద్దాం హుసేన్ అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నంద్యాల మండలం అయ్యలూరు మెట్ట సర్కిల్లో గురువారం రాస్తారోకో, ధర్నా చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు ప్రధాన చట్టాలతో సామాన్య రైతులు పూర్తిగా కుదేలవుతారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా కార్పోరేట్లకు ధారాదత్తం చేసేందుకే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వెంటనే బిల్లును రద్దు చేయాలని, రైతులు కోరుతున్న డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి నాగరాజు, నాయకులు పుల్లా నరసింహ, హుసేన్‌బాష, నిరంజన్, శివ, సురేష్, భారీ సంఖ్యలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల టౌన్: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ నంద్యాల డివిజన్కార్యదర్శి బాబా ఫకృద్దీన్ డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా స్థానిక రెవిన్యూ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బాబా ఫకృద్దీన్ మాట్లాడుతూ కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై లాఠీ చార్జీతో పాటు వాటర్ ఫిరంగ్లతో దాడిచేయడం దురదృష్టకరమన్నారు. ఉగ్ర వాదులపై దాడి చేసిన విధంగా రైతులపై పోలీసులతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు శ్రీనివాసులు, ప్రసాదు, షరీఫ్, ధనుంజయుడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల (ఎడ్యుకేషన్): వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని నంద్యాల విద్యార్థి, యువజన జేఏసీ చైర్మన్ రాజునాయుడు డిమాండ్ చేశారు. బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయ సెంటర్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జేఏసీ గౌరవాధ్యక్షుడు రామచంద్రుడు, వైస్ చైర్మన్ ఓబులేసు, కన్వీనర్లు రియాజ్, నాగన్న, వేణుమాదవరెడ్డి పాల్గొన్నారు.
నందికొట్కూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తు దీక్షలకు మద్దతుగా నందికొట్కూరు పట్టణంలో గురువారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఢిల్లీలో ఏడు రోజులుగా లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం సరిగా స్పందించడం లేదన్నారు. రైతులకు మద్దుతుగా ఆందోళనలు ఉధృతం చేసి వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంత వరకూ పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రెడ్డి, బెస్తరాజు, మద్దిలేటి, శ్రీనివాసులు, ఈశ్వరమ్మ, వెంకటేశ్వర్లు, మద్దమ్మ, లక్ష్మన్న పాల్గొన్నారు.
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల పట్టణంలో సీఐటీయూ జిల్లా స్థాయి కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల మేలు చేసేలా వ్యవసాయ చట్టాలను తెస్తోందన్నారు. వీఆర్ఏల జిల్లా సంఘం అధ్యక్షుడు సత్యరాజు, సీఐటీయూ నాయకులు నరసింహుడు, వెంకటరమణ, విజయ్, నాగరాజు, ఓబులేశు తదితరులు పాల్గొన్నారు.