వాహనదారులకు కలిసొచ్చిన ధర్నా
ABN , First Publish Date - 2020-12-13T05:44:52+05:30 IST
రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజా, రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.

- టోల్ కట్టకుండానే పంపించేసిన రైతు సంఘాల నాయకులు
రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజా, రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. టోల్ ప్లాజాల వద్ద శనివారం ఆందోళనలు చేపట్టారు. వాహనదారులు టోల్‌కట్టకుండా పంపించివేసి నిరసన తెలిపారు.
నంద్యాల, డిసెంబరు 12: కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ప్రజా, రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. ఢిల్లీలో రైతుల దీక్షకు సంఘీభావంగా శనివారం నంద్యాలలో ఆందోళన నిర్వహించారు. చాపిరేవుల టోల్‌గేట్ వద్ద రుసుము వసూళు చేయకుండా వాహనాలను ఉచితంగా గంటసేపు ప్రజాసంఘాల నాయకులు పంపించారు. రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పుల్లా నరసింహులు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.రమేష్‌కుమార్ డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు ఒకమాట, వచ్చాక మరోమాట చెబుతోందని అన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు. బీజేపీ రైతులకు అనుకూలమా?, కార్పొరేట్లకు అనుకూలమా? తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు నిరసన తెలియజేస్తుంటే ఇందులో విదేశీ హస్తం ఉందంటూ బీజేపీ చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సీపీఐ రైతు సంఘం కార్యదర్శి సోమన్న మాట్లాడుతూ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధరలేక ఎరువుల ధరలు పెరిగి రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. మార్కెట్ యార్డులను అభివృద్ధి చేసి రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల జిల్లా కార్యదర్శులు నాగరాజు, బాబాఫకృద్దీన్, ప్రసాద్, సద్దాంహుసేన్, మస్తాన్‌వలి, శ్రీనివాసమూర్తి, కేఎండీ గౌస్, తోట మద్దులు, సుబ్బరాయుడు, శ్రీనివాసులు, చౌడప్ప, తదితరులు పాల్గొన్నారు.
ఓర్వకల్లు: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు, ప్రజా సంఘాలు, ఏఐకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని నన్నూరు టోల్‌ప్లాజా వద్ద ఏఐకేఎస్ సీసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టి రుసుం కట్టకుండా వాహనాలను పంపి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, రామాంజనేయులు, చేతివృత్తుల సంఘం రాష్ట్ర నాయకులు, రైతు సంఘం సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా నాయకులు సూరాజ్య శేఖర్, ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ మాణిక్యం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఆనంద్‌బాబు, బీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగేష్ సీఐటీయూ నాయకుడు రాముడు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణ హాజరయ్యారు. నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చర్చలతో కాలయాపన చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను రైతులతో గాని, పార్లమెంటులో గాని చర్చించకుండా కేవలం కార్పొరేట్ కంపెనీలతో చర్చించి వారు తయారు చేసిన చట్టాలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆరోపించారు. కర్నూలు రూరల్ సీఐ శ్రీనాథ్ రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఆద్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.