పుష్కర మాయపై ఆరా

ABN , First Publish Date - 2020-11-26T06:47:18+05:30 IST

పారిశుధ్య కాంట్రాక్టర్లపై నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లకు విరుద్ధంగా పారిశుధ్య కార్మికుల నియామకాలపై దృష్టి సారించారు

పుష్కర మాయపై ఆరా

  1. పారిశుధ్య కార్మికుల వ్యవహారంపై కేఎంసీ దృష్టి 
  2. కాంట్రాక్టర్ల తీరుపై కమిషనర్‌ బాలాజీ ఆగ్రహం
  3. పని చేసిన వారికే బిల్లులు ఇస్తామని వెల్లడి
  4. ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


కర్నూలు, ఆంధ్రజ్యోతి: పారిశుధ్య కాంట్రాక్టర్లపై నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లకు విరుద్ధంగా పారిశుధ్య కార్మికుల నియామకాలపై దృష్టి సారించారు. పుష్కర ఘాట్లలో కేటాయించిన పారిశుధ్య కార్మికుల సంఖ్యను గోల్‌మాల్‌ చేసిన వైనంపై ‘పుష్కర మాయ’ అన్న శీర్షికన ఆంధ్రజ్యోతిలో బుధవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కేఎంసీ కమిషనర్‌ ఎక్కడెక్కడ ఎంతమంది  అవసరమని సూచించారు? ఎంతమంది పని చేస్తున్నారు? అని ఆరా తీశారు. తక్కువమంది పని చేస్తే వారికి మాత్రమే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇది కాంట్రాక్టర్లకు మింగుడుపడనట్లు తెలుస్తోంది. అయితే ఘాట్‌ ఇన్‌చార్జిల పనితీరుపైనా కమిషనర్‌ దృష్టి సారించారు. భక్తులే రాని ఘాట్లలో అసలు ఇప్పటిదాకా అంతమంది ఏం చేశారన్న కోణంలో అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీంతో అధికారులు నోట వెంట మాట రావడంలేదు. పైగా కలెక్టర్‌ వీరపాండియన్‌ చెప్పిన మేరకే తాము పనిచేస్తున్నామంటూ జిల్లా యంత్రాంగానికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. 


రాజకీయ హస్తం

పారిశుధ్య కార్మికుల వ్యవహారం వెనుక కొందరు చక్రం తిప్పుతున్నారు. కేఎంసీని బురిడీ కొట్టించి లక్షలాది రూపాయల బిల్లులు విడుదలయ్యేలా పావులు కదుపుతున్నారు. ఆరు రోజులుగా ఎవరూ ఈ పారిశుధ్య మాయను పట్టించుకోకపోవడంతో వాళ్ల పని సాఫీగా సాగిపోయింది. ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితం కావడం, కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెనుక ఉన్న వారు నగరానికి చెందిన ఓ బడా నాయకుడిని రంగంలోకి దించుతున్నారు. ఆయన జోక్యంతో పరిస్థితిని మళ్లీ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 


మంచి పని చేశారు 

ఘాట్ల పర్యవేక్షణలో భాగంగా కార్మికులు ఉన్నారా? లేదా? అనే చూస్తున్నాం తప్ప సూచనలకు అనుగుణంగా పనిచేస్తున్నారా? అనేది పట్టించుకోలేదు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో అప్రమత్తం అయ్యాం. ఘాట్లలో పని చేసిన వారికే బిల్లులు విడుదల చేస్తాం. ఇన్‌చార్జిల నివేదికలు పరిశీలిస్తాం. - డీకే బాలాజీ, కేఎంసీ కమిషనర్‌

Updated Date - 2020-11-26T06:47:18+05:30 IST