వారు ఎన్నికైనట్లే..!
ABN , First Publish Date - 2020-03-16T11:09:51+05:30 IST
వారు ఎన్నికైనట్లే..!
ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ స్పష్టత
మిగిలిన వారికి మాత్రమే ఎన్నికలు
వాయిదాతో అధికారులకు ఉపశమనం
కర్నూలు(న్యూసిటీ), మార్చి 15: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. అయినా, ఏకగ్రీవమైన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని 53 మండలాల్లో 16 మంది జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యారు. 37 మండలాల్లో 148 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 804 ఎంపీటీసీలకు గానూ 287 మంది ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1361 స్థానాల్లో పోటీ కొనసాగుతుంది. ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికారులు విధుల్లో మునిగితేలారు. నామినేషన్లు, పరిశీలన, అప్పీల్స్, ఉపసంహరణ ప్రక్రియలో అధికార పార్టీవైపు అధికారులు మొగ్గుచూపినట్లు ఆరోపణలు వచ్చాయి. 16 మండలాల్లో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకునేందుకు పోటీలో ఉన్న ఇతర పార్టీల నాయకులను భయబ్రాంతులకు గురిచేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, ఏకగ్రీవం అయిన స్థానాలను మినహయించి మిగిలిన స్థానాల్లో ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించింది.
అధికారులకు ఉపశమనం
జడ్పీ, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికలు ఒకేసారి రావడంతో అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. నెల రోజులుగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఓటరు జాబితా తయారీ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది నియామకం వంటి పనులతో తీరిక లేకుండా గడిపారు. మరో 15 రోజులు ఉంటే ఎన్నికలు అన్ని పూర్తి అవుతాయని భావించారు. ఇంత ఒత్తిడి ఉన్న సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన వాయిదా ఉత్తర్వులు వారికి ఉపశమనం కలిగించాయి. రోజూ ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఎన్నికల విధుల్లో నిమగ్నమైన అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎన్నికలు పూర్తి అయితేనే బాగుండేదని, ఆరు వారాల తరువాత మళ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యథావిధిగా ఎన్నికల కోడ్
ఎన్నికలు వాయిదా పడినా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్వులో పేర్కొంది. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది.