స్థానికం నిలుపుదల

ABN , First Publish Date - 2020-03-16T11:06:45+05:30 IST

స్థానికం నిలుపుదల

స్థానికం నిలుపుదల

ప్రజల ఆరోగ్యం కోసం ఎస్‌ఈసీ నిర్ణయం

కరోనా వైరస్‌ కారణంగా ప్రక్రియ ఆపేస్తున్నాం

జిల్లా ఎన్నికల అధికారి వీర పాండియన్‌


కర్నూలు(కలెక్టరేట్‌) మార్చి 15: స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆరు వారాల పాటు వాయిదా వేసిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వీరపాండియన్‌ ఆదివారం ఓ ప్రకనటలో తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం, పంచాయతీ రాజ్‌ చట్టం ద్వారా సంక్రమించిన విస్తృత, విచక్షణ అధికారాలను ఉపయోగించుకుని స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తూ ఎస్‌ఈసీ ఆదివారం ఆదేశాలు ఇచ్చిందని ఆయన వివరించారు. ఈ మేరకు జిల్లాలో జడ్పీ, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల అధికారులకు అర్జంట్‌ ఆఫీస్‌ నోట్‌ పంపినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ రద్దు కాదని, ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారని వెల్లడించారు. ఆరు వారాల తర్వాత సమీక్ష అనంతరం వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఎస్‌ఈసీ తెలిపినట్లు వెల్లడించారు. ఈ నెల 15న, 16న షెడ్యూల్‌ ప్రకారం జరిగే మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను ఎస్‌ఈసీ ఆదేశాల ప్రకారం తక్షణమే నిలిపివేయాలని మున్సిపల్‌ కమిషనర్లకు, రిటర్నింగ్‌ అధికారులకు అత్యవసర ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలకు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లను అవసరమైన మేరకు సవరిస్తామని, పంచాయతీ ఎన్నికలకు ఆరు వారాల తర్వాత సరికొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినా, జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని తెలిపారు. ఎస్‌ఈసీ ఆదేశాలను తక్షణమే క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులందరికీ పంపాలని జడ్పీ, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ అధికారులను, ఎన్నికల నోడల్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - 2020-03-16T11:06:45+05:30 IST