ఆ వైపున ప్రవేశం..

ABN , First Publish Date - 2020-12-26T05:36:33+05:30 IST

వైకుంఠ ఏకాదశి వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

ఆ వైపున ప్రవేశం..
అహోబిలంలో మాజీ మంత్రి అఖిలప్రియ దంపతులు

  1. ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న భక్తులు
  2.  వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన ఆలయాలు


వైకుంఠ ఏకాదశి వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. దీంతో ఆలయాలు కిటకిటలాడాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకున్నారు.


నంద్యాల (కల్చరల్‌), డిసెంబరు 25: నంద్యాల పట్టణంలోని పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సంజీవనగర్‌లో రామాలయంలో నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి దంపతులు ఉత్తర ద్వారా దర్శనంద్వారా స్వామి వారిని దర్వించుకున్నారు. సంజీవనగర్‌ కోదండరామాలయంలో భగవత్‌ సేవా సమాజ్‌ కమిటీ, గుడిపాటిగడ్డ వెంకటేశ్వరాలయంలో ఆలయ ఈవో వేణునాథరెడ్డి ఆధ్వర్యంలో, శ్రీకృష్ణ మందిరంలో ఆలయ అధ్యక్షులు పార్థసారధి కృష్ణ, ఆధ్వర్యంలో భక్తులకు దర్శనం అనంతరం పండ్లు పంపిణీ చేశారు. సంజీవనగర్‌ రామాలయంలో ప్రత్యేక భజనలు ఏర్పాటు చేశారు. భగవత్‌ సేవా సమాజ్‌ కమిటీ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య, శ్రీనివాస్‌, కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఈవో రామంజనేయ శర్మ, అంజి, రాధమ్మ, కిరణ్‌, బాలుడు, అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


ఆళ్లగడ్డ: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఉత్తర ద్వార ప్రవేశానికి భక్తులు శుక్రవారం పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి పురష్కరించుకొని ఉత్తర ద్వార ప్రవేశం నుంచి స్వామిని దర్శించుకునేందుకు వేకువజామున్నె వచ్చే భక్తుల కోసం మఠం మేనేజరు వైకుంఠస్వామి, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా కనీస సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


 ప్రముఖుల పూజలు


వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార ప్రవేశంలో అదనపు ఐదో జిల్లా జడ్జి అమ్మన్న రాజా, మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త బార్గవరామ్‌నాయుడు, తమ్ముడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. వీరికి వేదపండితులు స్వాగతం పలికి ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు.


బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కొండపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు కాటసాని తిరుపాల్‌రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం భక్తులు అమ్మవారిశాలలో వాసవీ అమ్మవారిని దర్శించుకున్నారు.


నందికొట్కూరు: పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


పాణ్యం: మండలంలోని ఆలయాల్లో ఏకాదశి వేడుకలు నిర్వహించారు. పాణ్యంలోని వీరనారాయణ స్వామి ఆలయంలో వేకువజామున ఆలయ గర్భగుడి ఉత్తర ద్వార ప్రవేశం ఏర్పాటు చేశారు. ఎస్సార్బీసీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీకృష్ణ దేవాలయాలను భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు సుబ్బశాస్త్రి, కృష్ణకుమార్‌ శర్మ, నాగరాజ శర్మ, ఆలయ ధర్మకర్త రాఘవయ్య, సిబ్బంది తిరుమలయ్య, మద్దిలేటి, మురళి తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2020-12-26T05:36:33+05:30 IST