ఎండుతున్న ఆయకట్టు
ABN , First Publish Date - 2020-09-12T11:04:32+05:30 IST
కళ్లెదుట నీరు పారుతున్నా పంటలు ఎండుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారు. రుద్రవరం మండల పరిధిలోని తెలుగు గంగ 22వ బ్లాక్ చానల్ తూము గేట్లు తె

బ్లాక్ చానళ్లకు అందని నీరు
తెలుగు గంగ అధికారుల నిర్లక్ష్యం
రుద్రవరం, సెప్టెంబరు 11: కళ్లెదుట నీరు పారుతున్నా పంటలు ఎండుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారు. రుద్రవరం మండల పరిధిలోని తెలుగు గంగ 22వ బ్లాక్ చానల్ తూము గేట్లు తెరవలేదు. దీంతో 22, 23, 24 బ్లాక్ చానళ్లకు సాగు నీరు అందడం లేదు. ఆయకట్టులో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మినుము తదితర పంటలు వాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూడు బ్లాక్ చానళ్ల పరిధిలో నాగులవరం, టి.లింగందిన్నె, ముత్తలూరు, నల్లవాగుపల్లె, నరసాపురం, ఆలమూరు, ఓబుళంపల్లె, పడకండ్ల గ్రామాల రైతులకు ఆయకట్టు భూములు ఉన్నాయి. సుమారు 20 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. తెలుగుగంగ ప్రధాన కాలువకు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఆగస్టు 14న సాగు నీరు విడుదల చేశారు. కానీ ఈ మూడు బ్లాక్ చానళ్లకు ఇప్పటి వరకు సాగు నీరు విడుదల చేయలేదు.
ప్రవాహం లేదు..
22వ బ్లాక్ చానల్‌లో సాగు నీటి ప్రవాహం లేదు. ఈ తూము కింద మరో రెండు కాలువలు ఉన్నాయి. అన్నింటికీ నీటి సరఫరా కావడం లేదు. నెల రోజులు గడిచిన అధికారులు పట్టించుకోవడం లేదు. కాలువ నీటిని నమ్ముకుని సాగు చేసిన పంటలు వాడు పడుతున్నాయి. - పార్థసారథి రెడ్డి, రైతు, నల్లవాగుపల్లె
గంగ నీరే ఆధారం.
గంగ నీరే ఈ ప్రాంతం రైతులకు ఆధారం. అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు కష్టాలు తప్పడంలేదు. కాలువలో నీటి జాడే లేదు. సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. - పక్కీరయ్య, రైతు, నరసాపురం
నీరు విడుదల చేస్తాం..
22వ బ్లాక్ చానల్ తూము తెరవాలని రైతులు రెండు రోజుల నుంచి అడుగుతున్నారు. తూము పరిస్థితిని పరిశీలించి నీటిని విడుదల చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - మోహన కృష్ణారెడ్డి, తెలుగు గంగ ఏఈ.